ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. గేమ్ ఛేంజర్ వల్ల ఆగిపోయింది. వేసవిలో వస్తుందనుకొన్నారు. మే 9 రిలీజ్ డేట్ అని భావించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం వేసవి బరి నుంచి తప్పుకొందని సమాచారం. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
చిరంజీవి – వశిష్ట కాంబోలో రూపొందిన సినిమా ఇది. త్రిష కథానాయిక. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సంక్రాంతికి విడుదల చేద్దామన్న ఉద్దేశంతో యూవీ సంస్థ ఓ టీజర్‌ని కూడా వదిలింది. అయితే అప్పటి నుంచే ఈ సినిమా కష్టాలు ప్రారంభమయ్యాయి. టీజర్‌లోని విజువల్స్ ఎవరికీ నచ్చలేదు. ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని పూర్తిగా తగ్గించేశాయి. దాంతో గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ఓటీటీ మార్కెట్ కూడా డీలా పడిపోవడంతో విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ‘విశ్వంభర’ డీల్స్ ఒకొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడయ్యాయి. ఓటీటీ డీల్ కూడా దాదాపుగా ఓకే అయినట్టే. కాకపోతే… రిలీజ్ విషయంలో మాత్రం చిత్రబృందం ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. ఈ సినిమా వేసవి బరిలో వచ్చే అవకాశాలు లేవని, ఆగస్టు 22 అయితే చిరంజీవి పుట్టిన రోజు కాబట్టి, ఇంకాస్త క్రేజ్ ఉంటుందని, ఫ్యాన్స్ కి కూడా ఓ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నారు. కాకపోతే రెండు పాటలు మినహా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ గ్యాప్ లో వీఎఫ్ఎక్స్పై మరింత కసరత్తు చేసే అవకాశమూ దక్కుతుంది.
మరోవైపు అనిల్ రావిపూడి చిరంజీవి కోసం ఓ కథ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టు పనులు మొదలెట్టేశారు రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’లా ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే అని తెలుస్తోంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.