తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా డబుల్ గేమ్ ఆడుతున్న విషయంపై మెల్లగా స్పష్టత వస్తోంది. వనపర్తిలో జరిగిన సభలో ఆయన మోదీ చాలా మంచోడన్నట్లుగా మాట్లాడారు. కిషన్ రెడ్డి మాత్రమే అడ్డుపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయి అంశాల వరకూ మోదీని విమర్శిస్తున్నారు. కానీ తెలంగాణకు వచ్చే సరికి కిషన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అక్కడే అసలు రేవంత్ రాజకీయం అర్థం కాక కాంగ్రెస్ నేతలు కూడా అయోమయానికి గురవుతున్నారు.
రేవంత్ మాట తీరులో మార్పు ఎందుకు వచ్చింది ?
రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ, బీఆర్ఎస్లను సమానంగా విమర్శించేవారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్నా .. కేంద్ర నాయకత్వాన్నే ఎక్కువగా టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం అదీ కూడా కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర రాజకీయాల్లోబిజీగా ఉండి.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు. వీకెండ్ లో మాత్రం వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేయలేదు. కానీ రేవంత్ కు అంతర్గతంగా ఏ సమాచారం తెలిసిందో కానీ.. ఆయనపై విరుచుకుపడుతున్నారు. తన కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ను బీజేపీకి దగ్గర చేస్తున్న కిషన్ రెడ్డి ?
రేవంత్ లో అనూహ్యమైన మార్పు రావడానికి కొన్ని కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది. ఆయనకు అంతర్గతంగా కీలకమైన సమాచారం తెలిసిందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి .. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం రేవంత్ కు ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డినే ఈ ఆపరేషన్ ను లీడ్ చేస్తున్నట్లుగా స్పష్టత రావడంతోనే టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ రాజకీయాలను ఎవరూ తక్కువ చేయలేరు. ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుందో మహారాష్ట్రలో ఉద్దవ్ ధాకడ్ సర్కార్ ను కూల్చేసిన వైనమే సాక్ష్యం. అలాంటిది చేయాలనుకుంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ ప్రారంభమైనట్లుగా రేవంత్ అనుమానిస్తున్నారు.
మోదీ చల్లని చూపు కోసమే రేవంత్ ప్రయత్నాలు
ఇటీవల మరో ఆరు నెలలే ప్రభుత్వం ఉంటుందని అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీని వెనుక లోతైన రాజకీయం ఉందని రేవంత్ నమ్ముతున్నారు. అయితే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు కూలగొట్టాల్సిన అవసరం లేదని.. తాను విధేయంగా ఉంటాననే సంకేతాలను రేవంత్ రెడ్డి మోదీకి పంపుతున్నారని చెబుతున్నారు. ఇటీవల ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. పార్టీ హైకమండ్ ను కలవలేదు. ఆయన వెంట శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మోదీపై చేస్తున్న వ్యాఖ్యలనుతగ్గించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఓ వైపు తనపై కాంగ్రెస్ హైకమాండ్ అపనమ్మకం పెంచుకుంటే మరో ఆప్షన్ తనకు ఉందన్న సంకేతాలను పంపిస్తున్నారని అనుకోవచ్చు.