కర్ణాటక రాజకీయాల్లో కలకలం బయలుదేరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సీఎం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆయన కూడా కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే విధేయత ప్రదర్శిస్తున్నారు. దీంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. ఆయనను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని వీరప్ప మొయిలీ ప్రకటించారు. మరో వైపు అసలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు డీకే ను సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ సిద్ధరామయ్యను సీఎంను చేశారు.
ఇద్దరికీ రెండున్నరేళ్ల కాలపరిమితి ఫార్ములాతో ఒప్పించారని ప్రచారం జరిగింది. ఈ ఫార్ములాను డీకే శివకుమార్ కొట్టిపారేయలేదు. అలాగని జరిగిందని బయటకు చెప్పడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మళ్లీ కాంగ్రెస్సే గెలుస్తుందని అంటున్నారు. డీకే శివకుమార్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ దాటిపోవడం లేదు. గతంలోనే ఆయనకు బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసిందని చెప్పుకున్నారు. ఆయన అంగీకరించకపోవడంతో కేసులు పెట్టారు. కొన్నాళ్లు తీహార్ జైల్లోనూ ఉన్నారు. అయినా ఆయన తగ్గలేదు.
ఇప్పుడు కూడా తగ్గడం లేదు కానీ.. బీజేపీ నేతలకు సన్నిహితమవుతున్నట్లుగా రాజకీయం మార్చారు. ఇది కాంగ్రెస్ లో కలకలం రేపింది. కర్ణాటక బీజేపీ నేతలు కూడా మరో ఏకనాథ్ షిండే అవుతారని ప్రచారం ప్రారంభించారు. దీనికి శివకుమార్ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. సిద్దరామయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది. ఒప్పందం ప్రకారం తనకు పదవి ఇవ్వాల్సిందేనని శివకుమార్ రాజకీయం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. మరి హైకమాండ్ ఏం చేస్తుందో?