గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి రౌండ్ లోన పది వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. రెండున్నర లక్షల వరకూ ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా పది రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. తొలి రౌండ్ లోనే ఆలపాటికి పదిహేడు వేల వరకూ ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి ప్రోగ్రెసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి . ..సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు ఏడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడు వేల ఓట్లు చెల్లలేదు. ఆ ఓట్లు పీడీఎఫ్ ఆభ్యర్థికి కలిపినా.. యాభై శాతం ఓట్లు కూటమి అభ్యర్థికి వస్తున్నాయి.
ఇదే హవా ఇతర రౌండ్లలోనూ కొనసాగితే మొదటి ప్రాధాన్యతా ఓట్లలోనే ఆలపాటి విజయం ఖరారవుతుంది. ఒక్క ఓటు ఎక్కువ వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవరు. పోలైన ఓట్లలో యాభై శాతం సాధించాలి. లేకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో ఒక్క రౌండ్డ లోనే పది వేల ఓట్ల ఆధిక్యం సాధించడంతో దాన్ని అధిగమించడం .. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ పార్టీ పరోక్షంగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కోసం పని చేసింది. ఆయన గత రెండు సార్లు పీడీఎఫ్ అభ్యర్థిగా గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటి నుంచి ప్రణాళికాబద్దంగా పని చేసుకున్నారు. ఆ ఫలితం.. ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోంది.