ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. అందులో ఒక స్థానంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు గతంలోనే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయి. బీజేపీకి ఎలాంటి అవకాశం లేదని తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికల్లో ఆ పార్టీ తరపునే అభ్యర్థి నిలబడనున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ సీటు ఖాళీ అయింది. అందుకే ఎమ్మెల్సీ అవకాశం లేదని భావిస్తున్నారు.
నాలుగు స్థానాల్లో అవకాశం కోసం చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారు. కూటమి పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. పదవి కాలం ముగుస్తున్న వారిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది సస్పెన్స్ గా మారింది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడుకి మళ్లీ అవకాశం ఇస్తారా ఇక ఆయనకు రిటైర్మెంట్ ఇస్తారా అన్నది టీడీపీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆయన తనకు అవకాశం ఇవ్వరేమోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే భవిష్యత్ లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లకు ఆయన పేరును పరిశీలించే ప్రతిపాదనతో ఆయనను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి.
మరో నేత పడుచూరి అశోక్ బాబుకు పొడిగింపు రావడం కూడా కష్టమే. జనసేన తరపున నాగబాబును ఎంపిక చేయడంతో మరో కాపు నేతకు అవకాశం దక్కడం కష్టమే. సామాజిక సమీకరణాల ప్రకారం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ సారి రిటైరైన ఎవరికీ అవకాశం దక్కదని నలుగురూ కొత్త వారికే చాన్స్ లభిస్తుందని అనుకుంటున్నారు. పోటీ చేసే పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ టిక్కెట్ త్యాగం చేసిన దేవినేని ఉమ, పిఠాపురం వర్మ వంటి వారు అవకాశం కోసం గట్టిగా ఆశలు పెట్టుకున్నారు.
వచ్చే ఐదేళ్లలో వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్సీ కానీ.. ఒక్క రాజ్యసభ సీటు కానీ వచ్చే అవకాశం లేదు. అన్నీ కూటమి పార్టీలకే వస్తాయి. అందుకే రాబోయే రోజుల్లో అందరికీ అవకాశాలు వస్తాయని టీడీపీ హైకమాండ్ చెబుతోంది.