పోసాని కృష్ణమురళి గుండెనొప్పి అని నాటకం ఆడి కనీసం ఆస్పత్రిలో అయినా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు కానీ.. ఆయనను రాష్ట్రంలోని అన్ని జైళ్ల చుట్టూ తిప్పేందుకు పోలీసులు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు పీటీ వారెంట్లు వేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజంపేట నుంచి నర్సరావుపేటకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి అనంతపురం ఆ తర్వాత శ్రీకాకుళం.. ఇలా దాదాపుగా పదిహేడు కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు వేసి అరెస్టులు చూపించనున్నారు. ఇక గోదావరి జిల్లాలలో కోర్టు ఆదేశాల మేరకు నమోదైన కేసులు కూడా ఉన్నాయి. వాటి సంగతి చివరిలో చూస్తారేమో ?
పోసాని కృష్ణమురళి తమ పార్టీకి అధికారం ఉందని రెచ్చిపోయారు. ఏదో సంపాదించుకుందామని కూటమి నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. కుటుంబాలను.. మహిళలను పిల్లలను కూడా వదిలి పెట్టలేదు. చివరికి అధికారం పోయిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ పై నోటి దురుసు చూపించారు. ఆ విషయంలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వాటికి సంబంధించి పీటీ వారెంట్లు రెడీ అయ్యాయి.
కేసులను తప్పించుకుందామని ఆయన తనకు ఇక రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. కానీ ఇలా చెప్పినంత మాత్రాన వదిలే అవకాశం లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు చేతలతో చూపించారు. ఇప్పుడు ఆయనకు చట్టం ఎంత బలమైందో.. వ్యవస్థలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.