97వ ఆస్కార్ పురస్కారాల్లో డైరెక్టర్ సీన్ బేకర్ తీసిన ‘అనోరా’ అవార్డులు కొల్లగొట్టింది. ఏ ఆర్భాటం లేని ఈ హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ఐదు ఆస్కార్ లని సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, నటి, డైరెక్టర్, స్క్రీన్ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు అందుకుంది.
ఈమధ్య కాలంలో ఆస్కార్ అవార్డులు భారీ బడ్జెట్, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, ఎవరూ ఊహించని ప్రపంచం..ఇలా అసాధారణంగా కనిపించే చిత్రాలకి ఇవ్వడం రివాజుగా మారింది. కానీ అనోరాలో ఈ హంగులేవీ లేవు.
ఇదొక వేశ్య కథ. న్యూయార్క్ కు చెందిన అనీ అనే ఓ 23 ఏళ్ల స్ట్రిప్పర్.. సంపన్నుడైన ఓ రష్యా యువకుడి మధ్య జరిగే కథ. రొటీన్ గానే వీళ్ళ పెళ్లికి కుర్రాడి ఫ్యామిలీ నుంచి సవాళ్ళు ఎదురౌతాయి. ప్రేమ, సహచర్యం, వర్గం, సామాజిక పరపతి.. ఇలాంటి ఇతివృత్తంతో రూపొందిన ఈ కథని జనరంజకంగా చిత్రీకరించారు సీన్ బేకర్.
వేశ్యకథలు ఇప్పుడు రావడం తగ్గింది కానీ అవార్డుల పంట పండించే సామర్ధ్యం వున్న కథలివి. ‘అనోరా’తో మళ్ళీ ఈ కథలు కొత్త ఊపు వచ్చిందనే చెప్పాలి. మనసు హత్తుకునేలా చిత్రీకరించాలే కానీ మినిమం బడ్జెట్ లో మ్యాజిక్ చేయొచ్చు. అలాంటి మ్యాజిక్ చేసి చూపింది అనోరా.