మండలిలో వైసీపీకి ఫుల్ మెజార్టీ ఉంది. బొత్స ప్రతిపక్ష నేతగా ఉన్నారు. చైర్మన్ కూడా ఆ పార్టీకి చెందిన వారే. అయినా ప్రభుత్వాన్ని ముఖ్యంగా మండలిలో అధికార పక్షం తరపున సమాధానాలు ఇచ్చేందుకు బాధ్యత తీసుకుంటున్న.. నారా లోకేష్‌ను బొత్స ఎదుర్కోలేకపోతున్నారు. ఆయన చెప్పిన విషయాలనే పదే పదే చెబుతున్నారు. కానీ లోకేష్ వైపు నుంచి వచ్చే సవాళ్ల కు సమాధానం చెప్పలేకపోతున్నారు.
వైస్ చాన్సలర్స్ ను టీడీపీ ప్రభుత్వం రాగానే రాజీనామాలు చేయించారని..వారిని బెదిరించారని బొత్స ఆరోపించారు. చిన్న ఆధారం తీసుకు వచ్చినా విచారణ చేయిస్తామని లోకేష్ సవాల్ చేశారు. ఇవాళ లోకేష్.. వీసీలు ఇచ్చిన రాజీనామా లేఖల్ని చూపించారు. ఇందులో ఎక్కడైనా బెదిరించారని ఉందేమో చూపించాలన్నారు. అయితే తాము ఆధారాలిచ్చామని మండలి బయట బొత్స చెప్పుకొచ్చారు. ఏం ఆధారాలిచ్చారో మాత్రం చెప్పలేదు. కూటమి ప్రభుత్వం రాగానే వరుసగా పదహారు మంది వరకూ వీసీలు రాజీనామాలు చేశారు. అదే ఆధారమని ఆయన అంటారు.
వైసీపీ హయాంలో నియమితులైన వీసీలకు ఓ మాదిరి ఇంగ్లిష్ కూడా రాదని వారు యూనివర్శిటీలను నడిపారని మండిపడ్డారు. వైసీపీ కార్యక్రమాలు చేయడం… జగన్ పుట్టినరోజులు జరపడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. యూనివర్శిటీలను భ్రష్టుపట్టించి.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినందున భయపడి వారు రాజీనామాలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వ్యవహారంలో వీసీ చేసిన నిర్వాకాలన్నింటినీ సభ ముందు పెడితే బొత్స పరువు పోతుందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఈ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేసిన బొత్సకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నారు.