ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి ముందందలో ఉన్నారు. భారీ మెజార్టీలు రావడం లేదు కానీ.. రెండో రౌండ్ ముగిసే సరికి దాదాపుగా పధ్నాలుగు వందల ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తం 14 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మూడో స్థానంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి ఇవ్వకపోయే సరికి బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ అనే అభ్యర్థి ఉన్నారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమయింది. చెల్లని ఓట్లను పక్కన పెట్టి చెల్లే ఓట్లను కట్టలుగా కట్టడానికే ఒకటిన్నర రోజు పట్టింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బీఎస్పీ తరపున బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లుగా లెక్కింపు ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఫలితం తేలకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో సగం వస్తేనే విజేత ప్రకటిస్తారు. లేకపోతే ఎలిమినేషన్ రౌండ్స్ లోకి వెళ్తారు. మూడో స్థానంలో ఉండే అభ్యర్థి ఎలిమినేషన్ ద్వారానే విజేత తేలే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే.. రేవంత్ సర్కార్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.