‘కార్టెల్’ పదం వినగానే పాబ్లో ఎస్కోబార్, వాల్టర్ వైట్ లాంటి నటోరియస్ క్యారెక్టర్స్ కళ్ళముందు కదులుతాయి. డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా, సిరిస్ అంటే అంతా పురుష సామ్రాజ్యమే. అయితే బాలీవుడ్ లో ఇందుకు భిన్నంగా అన్నీ మహిళా పాత్రలతో ఓ వెబ్ సిరిస్ వచ్చింది. అదే.. ‘డబ్బా కార్టెల్’. షబానా అజ్మీ, జ్యోతిక, నిమిషా సజయన్, శాలినీ పాండే, అంజలి ఆనంద్.. ఇలా పేరెన్నిక గల నటీమణులు నటించిన ఈ సిరిస్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. నిషేధిత ఔషధాలు, మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యం నేపధ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరిస్ ప్రేక్షకులని ఎంత మేరకు ఆకట్టుకోగలిగింది? ఈ చీకటి ప్రపంచంలో డబ్బా మిఠాయి తెచ్చిన చిక్కులేమిటి?
రాజి(షాలినీ పాండే) భర్త ఓ ఫార్మ కంపెనీలో ఉద్యోగి. తనకి జర్మనీ వెళ్లి సెటిల్ అవ్వాలని కోరిక. అయితే దానికి సరిపడా డబ్బు సమకూరాలి. భర్తకి సాయపడాలని ‘లంచ్ బాక్స్’ పేరిట వ్యాపారం చేస్తుంటుంది రాజి. మాల (నిమిషా సజయన్) రాజికి అసిస్టెంట్. తను పెద్ద చదువుకోలేదు. కనీసం తన బిడ్డనైన గొప్పగా చదివించి సమాజంలో గౌరవం పొందాలని మాలా ఆశ. మాలా బాయ్ ఫ్రెండ్ సంతోష్ ప్రైవేట్ వీడియోలు తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తాడు. లంచ్ బాక్సుల్లో ఆహారంతోపాటు గంజాయి సప్లయ్ చేయమని బెదిరిస్తాడు. తప్పని పరిస్థితిలో సరే అంటుంది. ఇది గంజాయి సరఫరాతో ఆగదు. డ్రగ్స్ సప్లయ్ చేయాలని వార్నింగ్ వస్తుంది. తర్వాత ఏం జరిగింది? డ్రగ్స్ రవాణాలోకి దిగాక ఎలాంటి పరిస్థితులు వచ్చాయి. ఈ కథలో రాజి అత్తయ్య షీలా (షబానా అజ్మీ) డ్రగ్ ఇన్స్పెక్టర్ పాఠక్ (గజరాజ్ రావ్) శంకర్ (జిషు సేన్గుప్త), వరుణ (జ్యోతిక) పాత్రలేంటి? ఇదంతా మిగతా సిరీస్.
మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అని పాత సామెత. ఈ సామెతని క్యారెక్టర్లు ఎక్కువైపోయినా ఎమోషన్ పలచబడిపొతుందని మార్చుకోవచ్చు. డబ్బా కార్టెల్ చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. ఈ కథలో మంచి కంటెంట్ వుంది. బ్యాన్ చేసిన డ్రగ్ ని అమ్ముతున్న ఓ ఫార్మా కంపెనీ, డబ్బా సరఫరాలో చిక్కుకున్న ఓ ‘లంచ్ బాక్స్’ గ్యాంగ్.. నిజానికి ఈ రెండు లేయర్లుతో ఆకట్టుకునే క్రైమ్ సిరిస్ ని చూపించవచ్చు. కానీ దర్శకుడు హితేశ్ భాటియా చాలా పాత్రలని కథనంలోకి తీసుకొచ్చి ఏ పాత్రకు కూడా సరైన పే అఫ్ లేకుండా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.
మొత్తం ఏడు ఎపిసోడ్స్ వున్న సిరిస్ ఇది. ఒకొక్క ఎపిసోడ్ నిడివి సుమారుగా 50 నిముషాలు. రాజి ఫుడ్ బిజినెస్, బ్యాన్ డ్రగ్ కి సంబధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ చేసే ఇన్వెస్టిగేషన్.. ఇలా రెండు కోణాల్లో ఈ సిరీస్ ముందుకు వెళుతుంది. తొలి ఎపిసోడ్ చాలా జాగ్రతగా చూడాలి. ఎందుకంటే ఈ సిరిస్ లోని కనిపించే పాత్రలు, వాటి పరిచయాలు, లక్ష్యాలు తొలి ఎపిసోడ్ లోనే వచ్చేశాయి.
పంజాబ్ లో జరిగిన ఒక కార్ యాక్సిడెంట్, అక్కడ దొరికిన డ్రగ్, రాజి ఫుడ్ బిజినెస్, మాల బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్, ఇన్స్పెక్టర్ పాఠక్ (గజరాజ్ రావ్) విచారణ, గంజాయి రవాణా,.. ఇన్ని సీన్లు,పాత్రలు చూసిన ప్రేక్షకుడు ఒకదశలో ఎందుకింత హడావిడి అనే ఫీలింగ్ కి జారుకుంటాడు.
రాజి అత్తయ్య షీలా (షబానా అజ్మీ) పాత్ర ఇందులో చాలా కీలకం. ఈ కథని ఆమె కోణంలో మొదలుపెట్టివుంటే కథ స్వరూపం వేరేలా వుండేది. బాషా టైపు ఆ క్యారెక్టర్ ని అండర్ ప్లే చేశాడు డైరెక్టర్. మామూలు మనిషిగా కనిపించే షీలా రంగంలోకి దిగాక సన్నివేశాల్లో కదలిక వస్తుంది. ఈ సిరిస్ మొత్తంలో నాలుగో ఎపిసోడ్ రసవత్తరంగా వుంటుంది. అయితే చివరి రెండు ఎపిసోడ్స్ ని కావాల్సిన దానికంటే ఎక్కువ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. రాజి పాత్ర రక్తంతో తడిచిన చీరని ఉదుకుతున్న సీన్ తో ఫస్ట్ సీజన్ ని ముగించారు. అయితే ఆత్మగౌరవం కోసం ప్రయాణం మొదలుపెట్టిన ఈ పాత్రలకు తొలి సీజన్ అయితే సరైన ముగింపు దొరకలేదనే చెప్పాలి.
షీలా పాత్రలో షబానా అజ్మీ తన అనుభవాన్ని చూపించారు. ఆ పాత్రని హుందాగా అదే సమయంలో ఎదో బలమైన ఫ్లాష్ బ్యాక్ ని మోస్తున్న పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. శాలినీకి రాజి పాత్ర కొత్త. డ్రగ్ వరల్డ్ ఆమె అమాయకత్వం చూసి చాలా చోట్ల జాలి పుడుతుంది. నిమిషా సజయన్ మాలా పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చింది. వరుణ పాత్రలో కనిపించిన జ్యోతిక కి సరైన సన్నివేశాలు పడలేదు.
అంజలి ఆనంద్, సాయి తమంకర్ ట్రాక్ ఈ కథనంలో సరిగ్గా కూర్చోలేదు. ఇన్స్పెక్టర్ పాఠక్ పాత్రలో చేసిన గజరాజ్ రావ్ ది వయోభారంతో ఇబ్బందిపడే పాత్ర. ఇంకాస్త టఫ్ గా కనిపించే నటుడు వుంటే ఈ ట్రాక్ కి ఒక జోష్ వుండేది. శంకర్ జిషు సేన్గుప్త తో పాటు మిగతా నటులంతా ఓకే అనిపిస్తారు. ముంబైని సహజంగా చూపించారు, నేపధ్య సంగీతంతో మిగతా టెక్నికల్ ఎలిమెంట్స్ డీసెంట్ గా వుంటాయి. ఇది అందరినీ ఆద్యంతం కట్టిపడేసే సీరిస్ కాదు కానీ క్రైమ్ జోనర్స్ ఇష్టపడే ఆడియన్స్ కి ఓ మోస్తారుగా నచ్చే కంటెంట్.