జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నాగేంద్ర బాబు నామినేషన్ వేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని పవన్ ఖరారు చేశారని నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని తెలిపింది. నాగబాబు అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతూండటంతో జనసేన పార్టీ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. లేకపోతే కూటమి తరపున ఐదు స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించి ఉండేవారు.
గతంలో నాగబాబుకు రాజ్యసభ స్థానం కేటాయించలేకపోవడం వల్ల ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రిగా పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మార్చిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని అనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ మంత్రిగా ప్రమాణం చేయించే విషయంలో మాత్రం జనసేన పార్టీ మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ హోదా ఉండేలా కీలక కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించి.. ఆ స్థానంలో మరొకరికి మంత్రిగా చాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు కలవకపోవడం.. ఇతర కారణాల వల్ల ఈ ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే నామినేషన్ల గడువు ప్రారంభమయింది. వైసీపీకి ఎమ్మెల్సీగా పోటీ చేసే బలం లేదు. ఈ కారణంగా పోటీ చేసే అవకాశం లేదు. చంద్రబాబు ఎంపిక చేసే ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఇందులో ఒక సీటు జనసేనకు కేటాయిస్తున్నందున నాలుగు సీట్లను చంద్రబాబు భర్తీ చేయనున్నారు. వంగవీటి రాధా, పిఠాపురం వర్మ, దేవినేని ఉమ వంటి వారు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.