ఛాంపియన్స్ ట్రోపీ టీమిండియా అభిమానుల్లో కొత్త జోష్ తెచ్చింది. ఆసీస్ ని సెమీస్ లో మట్టికరిపించిన భారత్, ప్రపంచకప్ లో ఎదురైన ఓటమికి పగ తీర్చుకుంది. సెమిస్ లో ఆసీస్ ని ఓడించడం టైటిల్ కొట్టినంత సంబరాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అసలు సిసలు ఫైనల్ పోరుకు రంగం సిద్దమైయింది. సెకండ్ సెమిస్ లో సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసిన న్యూజీలాండ్ జట్టు ఫైనల్ కి చేరింది. మార్చి 9న భారత్ కివీస్ మధ్య టైటిల్ ఫైట్ వుంటుంది.
ఫైనల్ మ్యాచ్ చాలా ప్రత్యేకం. సెమిస్ లో కంగారులని ఇంటిబాట పట్టించి ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ కు మరో ప్రతీకారం తీర్చుకునే బంగారం లాంటి అవకాశం ఇది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా ఫ్యాన్స్ కి ఓ పీడకల. ఈ మ్యాచ్ లో భారత్‌ను ఓడించి ప్రపంచకప్ ఆశలుపై నీళ్ళు చల్లింది న్యూజిలాండ్. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ లో భారత్ కి ఎదురుగా కివీస్ వుంది.
ఫైనల్ పోరు ఆసక్తికరంగానే వుండబోతోంది. ఒకసారి దెబ్బతిన్న జట్టుతో ఎప్పుడూ ప్రమాదమే. పైగా దుబాయ్ లో కివీస్ కి ఒక మ్యాచ్ ఆడిన అనుభవం వచ్చింది. అక్కడ పిచ్ కండీషన్ పై ఒక అవగాహన వచ్చి వుంటుంది. ఎక్కడ తప్పులు చేశారో వాటిని రివ్యూ చేసుకుని సరిదిద్దుకునే అవకాశం వుంది.
పైగా కివీస్ జట్టు మంచి ఫామ్ లో వుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు సెంచరీలు బాదేస్తున్నారు. బౌలింగ్ లో కూడా బలంగా వుంది. రచిన్ రవీంద్ర, పిలిఫ్స్, శాంటనర్ ఇటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో రాణించగలరు. అన్ని విధాలు పటిష్టంగా వున్న ఆ జట్టు టీమిండియాకి గట్టిపోటీనే. అయితే ఇప్పటికే గ్రూప్ దశలో కివీస్ ని ఓడించిన ఇండియా పూర్తి ఆత్మ విశ్వాసంతో వుంది. ఇదే జోరు చూపిస్తూ ఫైనల్ లో కివీస్ ని చిత్తు చేయడమే అసలైన రివెంజ్.