సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై విచారణకు హాజరు కాకుండా.. ఎనిమిది వారాల తర్వాత వస్తానని పెడసరంగా సమాధానం ఇచ్చిన ఆర్జీవీకి అరెస్టు భయం పట్టుకుంది. పోసానిని పట్టుకుని లోపలేసి.. రాష్ట్రం అంతా తిప్పుతున్నట్లుగా తనను కూడా అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఆయన హడావుడిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఫిర్యాదులు విద్వేషాలు రెచ్చగొట్టేలా చిత్రీకరించారని ఫిర్యాదులు రావడంతో సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసి .. హాజరు కావాలని నేరుగా ఆయనకే నోటీసులు ఇచ్చారు.
ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సీఐడీ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. అప్పుడు తీసుకున్న ఆయన తర్వాత.. తాను రాలేనని మాట మార్చారు. తను తీసిన శారీ అనే సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటానని చెప్పుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్లు ఆయన ఎక్కడ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ పోలీసులు మరో నోటీసు జారీ చేయలేదు. విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయనను అరెస్టు చేసే వ్యూహంతో ఉన్నారని ఆయనకు డౌట్ వస్తోంది.
పోసాని తాను ఇక రాజకీయాలకు దూరమని చెప్పిన తర్వాత కొంత కాలం సైలెంటుగా ఉన్నారు. కానీ వదిలి పెట్టే ప్రశ్నే లేదని ఆయన హఠాత్ అరెస్టుతో నిరూపించారు. పోసానితో పోలిస్తే రామ్ గోపాల్ వర్మనే ఎక్కువగా కూటమి నేత అహం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అడ్డగోలు మాటలు మాట్లాడారు. సినిమాలు తీశారు. మార్ఫింగ్లు వేశారు. ఆయనకు ఇంకా మిసెరబుల్ ట్రీట్ మెంట్ ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇవన్నీ ఆయనకు తెలుస్తూనే ఉన్నాయి.
విచారణకు హాజరు కావొద్దని ఏ కోర్టూ చెప్పదు. తప్పుడు పనులు చేసినప్పుడు చట్టాలు తన పని తాను చేయవద్దని ఏ కోర్టూ చెప్పదు. కానీ కనీసం అరెస్టు నుంచి రక్షణ కోసమైనా ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కానీ చట్టబద్ధంగా నట్లు బిగించడంలో కూటమి నేతలు మాస్టర్ ప్లానర్లుగా మారడంతో ఆర్జీవీకి టెన్షన్ వదలడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే.. కనీసం ఓ మూడు, నాలుగు నెలలైనా ఆర్జీవీ జైల్లో గడపక తప్పదేమో ?