చాలా కాలంగా టీడీపీ అభిమానులకు, అన్నగారి కుటంబ ప్రేమికులకు ఉన్న వెలితి తీరిపోయింది. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. అంతేనా ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకున్నారు. చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చి ..మళ్లీ ఢిల్లీ వెళ్లారు. దీన్ని బట్టి ఈ కార్యక్రమానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి విరమించుకుని ప్రస్తక రచనలు చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రపంచ చరిత్ర అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకావిష్కరణ విశాఖలో జరిగింది. వెంకయ్య, చంద్రబాబు సహా చాలా మంది దిగ్గజాలు వచ్చారు. అందరిలోకెల్లా చంద్రబాబు, దగ్గుబాటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం వారి మధ్య గతంలో ఉన్న రాజకీయ వివాదాలే. ఓ సందర్భంలో చంద్రబాబు పేరు కూడా పలకనంతటి వ్యతిరేకత రెండు కుటుంబాల మధ్య ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో … కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో దగ్గుబాటి వైసీపీలో చేరారు. కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసం ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చింది. పౌరసత్వం కారణంగా కుమారుడు పోటీ చేయలేకపోవడంతో తానే పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.
అంతకు ముందు చంద్రబాబుపై ఓ పుస్తకం కూడా రాశారు. వైసీపీ ఆ పుస్తకాన్ని వైరల్ చేసింది. అయితే జగన్ అంటే ఏమిటో ఆయన సీఎం అయ్యాక దగ్గుబాటికి కూడా తెలిసి వచ్చింది. పురందేశ్వరిని కూడా వైసీపీలో చేరాలని లేకపోతే మీరు కూడా అవసరం లేదని మొహం మీదనే చెప్పేయడంతో దగ్గుబాటి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత కుటంబ పరమైన కార్యక్రమాల్లో అందరూ కలవడం ప్రారంభించారు. చివరికి ఇప్పుడు అన్ని రకాల స్పర్థలు తొలగిపోయాయి. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సభా వేదికపైనే ప్రకటించారు. చంద్రబాబుతో తనకు విరోధం ఉందని చాలా మంది అనుకుంటారని..అది నిజమే అయినా అది గతం అన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలూ లేవన్నారు. కాలంతో పాటు మనమూ మారాల్సి ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా నందమూరి కుటుంబం ఏకతాటిపైకి మళ్లీ రావడం.. ఆ కుటుంబ అభిమానుల్ని సంతోషపరుస్తోంది. అందుకే నందమూరి అల్లుళ్లు ఆలింగనం చేసుకున్న ఫోటో వైరల్ అవుతోంది.