అంతర్యుద్ధం సృష్టిద్దామని గోరంట్ల మాధవ్ అనంతపురం నుంచి రెండు రోజుల పాటు జర్నీ చేసి విజయవాడకు వస్తే .. సైబర్ క్రైమ్ పోలీసులు చేతులు ఖాళీ లేవని చెప్పి అరగంట కూర్చోబెట్టి..మళ్లీ నోటీసు ఇస్తామని చెప్పి పంపేశారు. దీంతో ఆయన పని అరగంటలో పూర్తయిపోయి బయటకు వచ్చి మీడియా ముందు.. తాను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని చెప్పుకొచ్చారు.
పోక్సో కేసులో బాధితురాలి పేరు బయటకు చెప్పడంతో ఆయనపై మాజీ మాహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే హాజరు కావాలని పోలీసులు కొంత ఆలస్యంగా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చినందుకే ఆయన ఫైర్ అయిపోయారు. గొంతు నొక్కేస్తున్నారని.. ఫీలయ్యారు. అంతర్యుద్ధం వచ్చేస్తుందన్నారు. చివరికి వెళ్తే అరెస్టు చేస్తారేమోనన్న భయంతో వెళ్లాలా వద్దా అని ఆలోచించారు. చివరికి లాయర్లు వెళ్లాల్సిందే అని చెప్పడంతో భయంభయంగా రెండు రోజుల పాటు జర్నీ చేసి.. ఐదో తేదీన రమ్మంటే ఆరో తేదీన వెళ్లారు.
పోలీసులు మాత్రం మరోసారి 41ఏ నోటీసు ఇచ్చి పంపించారు. సైబర్ క్రైమ్ కార్యాలయం వద్ద కూడా మాధవ్ అనుచరులు హంగామా చేశారు. పది మంది లాయర్ల డ్రెస్సులేసుకుని లోపలికి పోతామని హడావుడి చేశారు. పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులకు తీరిక లేకపోవడంతో పంపేశారని.. మరోసారి అసలు విచారణ ఉంటుందని చెబుతున్నారు.