అధికారంలో తమ ప్రభుత్వం లేదు.. ఎక్కడ చిన్న తప్పు చేసి దొరికిపోయినా బయటకు రాకుండా స్క్రూలు బిగించడానికి రెడీగా ఉంటారని తెలిసి కూడా .. కొంత మంది నేర స్వభావం ఉన్న వైసీపీ నేతలు.. తమ సిల్లీ ప్రయత్నాలు మానుకోవడంలేదు. అలాంటి పనులు చేసి దొరికిపోతున్నారు. నిజానికి వీరు తప్పులు చేసేదాకా ఎదురు చూస్తున్నారు. తప్పులు చేస్తున్నారని తెలిసి కూడా పట్టించుకోవడంలేదు. అంతా అయిపోయాక వారికి మరిన్ని నట్లు బిగిస్తున్నారు.
వంశీని పోలీసులు అరెస్టు చేయలేదు. కానీ వంశీనే గెలుక్కున్నాడు. టీడీపీ ఆఫీసుపై దాడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో కిడ్నాప్ చేసి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడు. ఇలా చేస్తున్నాడని ఇంటలిజెన్స్ కు తెలియదా?. తెలిసో తెలియదో కానీ.. తెలిసినా ఆపేది కాదేమో. ఎందుకంటే.. వంశీని బుక్ చేయాలంటే..ఆ తప్పు చేయాలి. చేసేదాకా చూసి ఓ తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకు వచ్చారు. అసలు కేసును ఈ పద్దతిలో ఉపసంహరించుకోవాలన్న ఆలోచనే రాకూడదు. కానీ వంశీకి వచ్చింది..జైల్లో తేలాడు.
బోరుగడ్డ అనిల్ కూ అలాంటి ఆలోచనే వచ్చింది. మహా అయితే మరో నెలలో ఏదో విధంగా బెయిల్ వచ్చేదమో కానీ.. తన తల్లికి అనారోగ్యమని తప్పుడు సర్టిఫికెట్ పెట్టి .. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు. ఆయనకు బెయిల్ వచ్చిన విషయం మీడియాకు కూడా తెలియదు. సైలెంటుగా బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చాక పోలీసులు ఆయన తప్పుడు సర్టిఫికెట్ పెట్టి..కోర్టును మోసగించి బయటకు పోయాడని మీడియాకు లీక్ చేశారు. హైకోర్టుకు కూడా చెప్పారు. ఇప్పుడు బోరుగడ్డ పరిస్థితి బోరుబావిలో పడిన వ్యక్తి మాదిరి అయిపోనుంది.
హైకోర్టుకే తప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వడం దగ్గర నుంచి .. తల్లికి చికిత్స పేరుతో ఎటు పోయాడో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం వ్యవహారంలో వంశీ, బోరుగడ్డ..బయటకు రాలేని విధంగా వారే ఇరుక్కున్నారు. ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు వైసీపీ నేతలకే ఎందుకు వస్తాయో మరి !