మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి ‘గడప గడపకి వైఎస్సార్ పార్టీ’ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. వైకాపాలో గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెదేపా వైఫల్యాల గురించి ప్రజలకి వివరించి, దానిపై ప్రజాభిప్రాయసేకరణ చేస్తారు. దాని కోసం వంద ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నాపత్రాన్ని వైకాపా రూపొందించింది. వాటి ఆధారంగా వైకాపా తన భవిష్య ప్రణాళికలు రూపొందించుకొంటుంది.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వంతో పోరాడుతూ ప్రజలకి చేరువయ్యేందుకు ప్రయత్నించడం సర్వసాధారణమైన విషయమే. కానీ వైకాపా ఇప్పటికే ఆ పని చేస్తూనే ఉంది కూడా. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అది గట్టిగా నమ్ముతున్నట్లయితే అది ప్రభుత్వంతో యుద్ధం చేయాలి. లేదా న్యాయస్థానంలో చేయాలి. కానీ ఈవిధంగా పనిగట్టుకొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎందుకు? దాని వలన పార్టీకి లాభం చేకూరుతుందా లేకపోతే ఇంకా వ్యతిరేకత పెరుగుతుందా? అని ఆలోచించి ఉంటే బాగుండేది.
రాజధాని, పట్టిసీమ ప్రాజెక్టులని వ్యతిరేకిస్తునందుకు, తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా సాక్షిలో వార్తలు, కధనాలు ప్రచురిస్తునందుకు వైకాపాని ఆంధ్రా వ్యతిరేక పార్టీ, ఆంద్ర అభివృద్ధికి అడ్డుకొనే పార్టీ, ఆంధ్రాలో తెరాస ఏజంట్ అని తెదేపా నేతలు గట్టిగా వాదిస్తుంటే, తమ పార్టీ అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, వాటిలో జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నమంటూ వైకాపా నేతలు పదేపదే ప్రజలకి సంజాయిషీలు ఇచ్చుకోవడం చూస్తూనే ఉన్నాము.
అయితే తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపణలు చేస్తున్న వైకాపా వాటిలో ఒక్కటయినా న్యాయస్థానంలో నిరూపించి ఉండి ఉంటే దాని ఆరోపణలకి విలువ ఉండేది. కానీ కేవలం ఆరోపణలకే పరిమితం అవడం వలన రాష్ట్రాభివృద్ధికి వైకాపా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్న తెదేపా మాటలే ప్రజలకి ఎక్కువగా చేరుతున్నాయని చెప్పక తప్పదు. కనుక ఇప్పుడు ఈ ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమంతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం వలన తెదేపా వాదనలకి మరింత బలం చేకూర్చినట్లే అవుతుంది.
వైకాపాని ప్రజలకి మరింత చేరువవ్వాలంటే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలని పార్టీలో సభ్యులుగా చేర్చుకొనేందుకు ప్రయతిస్తే ఫలితం ఉంటుంది. అలాగే ‘వైకాపా అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే..కేవలం ఆయన మాత్రమే ధర్నాలు దీక్షలు చేయాలి.. ఏ అంశంపైనైనా ఆయన మాత్రమే మాట్లాడాలి..పోరాడాలి..పార్టీలో వేరెవరూ చొరవ తీసుకోకూడదు’ అన్నట్లుగా వ్యవహరించడం కూడా సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఎన్నో సమస్యలున్నప్పుడు కేవలం తను మాత్రమే వాటిపై మాట్లాడాలి…పోరాడాలనే ధోరణిని జగన్ వదిలించుకోగలిగితే, అన్ని జిల్లాలలో పార్టీ నేతలలో ఉత్సాహం వస్తుంది అందరూ యాక్టివ్ అవుతారు. అప్పుడు ఇలాగ అందరి గుమ్మాలు ఎక్కవలసిన అవసరమే ఉండదు కదా.