నాని నిర్మించిన సినిమా కోర్ట్. సినిమాకి బిగ్ స్టార్ ఎట్రాక్షన్ లేదు కానీ ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణీ లాంటి మంచి నటులు వున్నారు. టీజర్, ట్రైలర్ బావున్నాయి. ఫోక్సో చట్టం నేపధ్యంలో కొత్త దర్శకుడు జగదీశ్ సినిమాని తీశాడు. నాని ఈ కథపై పెట్టిన నమ్మకమే ప్రధాన ఆకర్షణ. జనాల్ని థియేటర్లోకి తీసుకురావడానికి నానినే ఎదో చేయాలి. ప్రీరిలీజ్ ఈవెంట్ అందుకు వేదిక అయ్యింది. ”నా కెరీర్ లో ఎప్పుడూ సినిమా చూడామని కోరలేదు. దయచేసి కోర్ట్ సినిమా చూడండి. మీకు నచ్చకపొతే నా హిట్ 3 సినిమా చూడకండి’అని బోల్డ్ గా ప్రకటించాడు నాని. ఈ రెండు సినిమాలకి నానినే నిర్మాత. కోర్ట్ చిన్న సినిమా కానీ హిట్ 3 పెద్ద స్కేల్ మూవీ. అలాంటి సినిమాని ఛాలెంజ్ లో పెట్టాడు నాని. కోర్ట్ మీద నమ్మకంతోనే ఈ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు ప్రేక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకున్నాయి. హిట్ తప్పితే థియేటర్ రెవెన్యూ చేసిన సినిమాలు పెద్దగా లేవు. కోర్ట్ సినిమాని మాత్రం థియేటర్ ని దృష్టిలో పెట్టుకొని తీశారు. ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్స్ కి తీసుకురావాలనే ఉద్దేశంతో నాని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకోవాలి. కంటెంట్ పై నానికి నమ్మకం వుంది. అయితే ఈ రోజుల్లో థియేటర్ లో టికెట్లు తెగె సినిమాల కేటగిరీ మారిపోయింది. ఒక స్టార్ వాల్యూ వుంటేనే థియేటర్ వైపు చూస్తున్నారు ఆడియన్స్. కాకపోతే మౌత్ టాక్ తో ఫుట్ ఫాల్స్ పెరిగిన సినిమాలు కూడా వుంటాయి. నాని నమ్మకం కూడా అదే. తన మాట కారణంగా ఎంతోకొంత మంది థియేటర్స్ కి వస్తే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశ. మరి కోర్ట్ కి ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.