‘సినిమాలో ఒకసారి ముఖం కనిపిస్తే చాలు అదే చరిత్ర అయిపోతుంది. సినిమా నీకోసం దాచి ఉంచిందేదైనా, ఎంత కాలమైనా సరే, అది నీకు దొరుకుంది’. సినిమాలో ఒక క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఇది.
1985లో వర్షం కురుస్తున్న రాత్రి ఓ అమ్మాయిని ముగ్గురు చాపలో చుట్టి పాతేస్తారు. 2024లో ఓ వర్షం కురిసిన రోజున ఆ అమ్మాయి అస్తి పంజరం బయటపడుతుంది. పైన డైలాగ్ ని ఈ సీన్ తో ముడిపెట్టి ఓ కథని ఊహించండి. థ్రిల్ తో ఆలోచనలు పరుగులు పెట్టేస్తున్నాయి కదా.. ‘రేఖాచిత్రం’ అలాంటి థ్రిల్ పంచే సినిమానే.
మళయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘రేఖాచిత్రం’. ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చిన్న బడ్జెట్ లో పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు సోనీలీవ్ వేదికగా ఓటీటీకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లోని స్పెషాలిటీ ఏమిటి? ఒక మర్డర్ మిస్టరీని దర్శకుడు జోఫిన్ టి. చాకో ఎంత సృజనాత్మకంగా చూపించాడంటే..?
రాజేంద్రన్ (సిద్దికీ) తన ఆత్మహత్యని ఫేస్బుక్ లైవ్ లో ఇస్తాడు. తాను ఆత్మహత్య చేసుకున్నచోటే ఓ మహిళ శవం ఉందని, విన్సెంట్ (మనోజ్ కె.జయన్) సహా మరో ముగ్గురితో కలిసి ఆ శవాన్ని రెండు దశాబ్దాలు క్రితం పూడ్చామని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ వివేక్ (ఆసిఫ్ అలీ) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. రాజేంద్రన్ చెప్పిన చోట తవ్వి చూస్తే, నిజంగానే అస్థిపంజరం దొరుకుతుంది. అసలీ అస్థిపంజరం ఎవరిదీ? ఈ కేసుని వివేక్ ఎలా పరిష్కరించాడు? అనేది మిగతా కథ.
కథలో మరో కథ. ఆ కథలో ఓ సినిమా. ఆ సినిమాలో మరో కథ. ఇలాంటి విలక్షణమైన కథనంతో నడిచే సినిమా ఇది. ”హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో కన్యాకుమారి నుంచి త్రివేండ్రం చేరుకుని జూనియర్ ఆర్టిస్ట్ గా మారిన ఓ అమ్మాయి హత్యకు గురౌతుంది’.. కథ ఇలా చెబితే రొటీన్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంతే రొటీన్ అనిపించే ఈ కథని దర్శకుడు చెప్పిన విధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొత్త కథలు వుండవు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలానే మాటకు రేఖా చిత్రం మరో నిదర్శనం.
ఈ సినిమాలో రైటింగ్ ఎంత బ్రిలియంట్ గా వుందో చెప్పడానికి ఓ ఉదాహరణ. ఒక వర్షం కురిసిన రాత్రి ఓ అమ్మాయిని నలుగురు వ్యక్తులు పాతేస్తారు. ఇంక దాని గురించి ఎవరూ పట్టించుకోరు. అమ్మాయిని పాతేసిన వ్యక్తే ఇరవై ఏళ్ల తర్వాత నిజం చెబుతాడు. పోలీసులు తవ్వుతారు. అప్పుడు కూడా అది బయటపడదు. ఇదే సమయంలో వర్షం కురుస్తుంది. అప్పుడు అస్థికలు బయటపడతాయి. ఈ మొత్తం సీక్వెన్స్ లో దర్శకుడు వర్షాన్ని ఒక మెటాఫర్ గా, క్యారెక్టర్ గా వాడిన విధానం చూస్తే వావ్ అనిపిస్తుంది.
1985లో మమ్ముట్టి నటించిన ‘కాథోడు కాథోరం’ షూటింగ్ లొకేషన్ లో అనూహ్యంగా మిస్సయిపోయిన రేఖా (అనస్వర రాజన్), ఆమె గురించి 2024 లో పోలీస్ ఆఫీసర్ వివేక్ చేసే ఇన్వెస్టిగేషన్.. ఈ రెండు కోణాల్లో కథనం నడుస్తోంది. తొలి ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకుడ్ని అరెస్ట్ చేస్తే కథలో కూర్చోబెడతాడు దర్శకుడు. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు టర్న్ లు వుండవు కానీ అసలు ఈ రేఖ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ? ఏమైయింది? ఆ రాత్రి ఏం జరిగింది? ఇలా చివరి వరకూ ఒక సస్పెన్స్ థ్రిల్ తో నడుస్తుంది.
ఆసిఫ్ అలీ సహజమైన నటుడు. వివేక్ పాత్రలో అంతే సహజంగా కనిపించాడు. తన కళ్ళల్లో ఇంటన్సిటీ ఇలాంటి థ్రిల్లర్స్ కి నప్పుతుంది. ఇది రేఖ (అనస్వర రాజన్) కథ. రేఖ పాత్రని అందంగా పోషించింది. ఆమె కళ్ళలో అమాయకత్వం ప్రేక్షకుడి వెంటాడుతుంది. కదిలించేస్తుంది. విన్సెంట్ (మనోజ్ కె.జయన్) పాత్రని డిఫరెంట్ గా ట్రీట్ చేశారు. ఆ క్యారెక్టర్ ఓపెనింగ్ లోనే అతడే అసలు దోషి అనే హింట్ ఆడియన్స్ కి ఇవ్వడం ఇందులో స్పెషాలిటీ. అయితే ఏం జరిగింది? ఏం చేశాడనేది చివరి వరకూ సస్పెన్స్. ఇందులో మరో కీలకమైన ఫీమేల్ క్యారెక్టర్ వుంది. అందుకోసం సినిమా చూడాల్సిందే. ఏఐలో మమ్ముటీ యంగర్ వెర్షన్ ని చూపించడం బావుంది. తెలుగు డబ్బింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. నేపధ్య సంగీతం, వింటేజ్ సెటప్ అన్నీ చక్కగా కుదిరాయి. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ రేఖా చిత్రం తెగ నచ్చేస్తుంది.