వివేకా కేసులో వరుసగా సాక్షులు చనిపోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రంగన్నకు రీ పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత అనుమానాస్పద పరిస్థితులు ఉండటంతో వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించాలని డిసైడయ్యారు. పదహారు మందితో సిట్ ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్ డీఎస్పీ నేతృత్వం వహిస్తారు. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను కూడా ఇందులో భాగంగా ఉంటారు.
ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో అత్యంత కీలకమైన సాక్షులు ఆరుగురు చనిపోయారు. వైసీపీ హయాంలోనే నలుగురు చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు చనిపోయారు. అందరూ అనారోగ్య కారణాలతోనే అనుమానాస్పదంగా చనిపోతున్నారు. చనిపోయిన వారిలో చాలా మందికి సరైన ఆరోగ్య సమస్యలు కూడా లేవు. హఠాత్తుగా అానారోగ్యం పాలై చనిపోతున్నారు. ఈ క్రమంలో వీటిని అనుమానాస్పద మరణాలుగా భావించి .. గుట్టు ఏమిటో బయట పెట్టాలనుకుంటున్నారు.
సాక్షుల మరణాల విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తే.. వివేకా హత్య కేసులోని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారని.. వారిని అడ్డుకున్నారని.. బెదిరించారని తేల్చారు. గతంలో కడపలో పని చేసిన పోలీసులు, ఇతర అధికారుల్ని కూడా విచారించి.. ఈ సీక్రెట్లేమిటో సిట్ బయట పెట్టనుంది.