సంక్రాంతి తరవాత వేసవి మంచి సీజన్. కాలేజీలకు సెలవలు కాబట్టి కుర్రాళ్లు ఫ్రీ అయిపోతారు. వాళ్లే బాక్సాఫీసు మహారాజ పోషకులు కాబట్టి మంచి సినిమా వస్తే వసూళ్లకు అడ్డు ఉండదు. ఇలాంటి సీజన్ లో యావరేజ్ సినిమాలకూ టికెట్లు బాగానే తెగుతాయి. కాబట్టి ప్రతీ వేసవిలోనూ పెద్ద, మీడియం రేంజు సినిమాల హడావుడి కనిపిస్తుంది. అయితే ఈసారి మీడియం సినిమాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద సినిమాలు కొన్ని రిలీజ్ అవుతాయని ఆశించినా, రకరకాల కారణాల వల్ల ఆ సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం పొంచి వుంది. దాంతో ఈ సీజన్ పెద్ద సినిమాలేం లేకుండానే ముగిసిపోతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` వల్ల చిరు వెనుకడుగు వేయాల్సివచ్చింది. సంక్రాంతి మిస్ అయితే.. వేసవికి రావడం ఖాయం అనుకొన్నారు. మే 9న ‘విశ్వంభర’ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికి కూడా ఈ సినిమా విడుదల కాదని ఇన్ సైడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి. కొంతమంది ఆగస్టు వరకూ ఆగాల్సిందే అంటున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆగస్టుకి షిఫ్ట్ అయితే ఈ వేసవిని చిరు మిస్ చేసుకొన్నట్టే.
పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మార్చి 28న రావాలి. కానీ ఇప్పటి వరకూ ఉలుకూ పలుకూ లేదు. ఓ వైపు అడపా దడపా ప్యాచ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. పవన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సివుంది. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో తెలీదు. వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. వాటికి సంబంధించిన వర్క్ కూడా ఇంకా పూర్తి కాలేదు. పవన్ సర్దుబాటుని బట్టే ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. ఏప్రిల్ వరకూ ఈ సినిమా పూర్తవదని, ఆ తరవాత ప్రీ ప్రొడక్షన్, పబ్లిసిటీ పనులు ఉన్నాయి కాబట్టి… మే, జూన్లు కూడా దాటిపోవచ్చని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘రాజాసాబ్ది’ మరో బాధ. రెండు పాటలూ, కొంత టాకీ వర్క్ మిగిలి ఉన్న సినిమా ఇది. ఏప్రిల్ లో విడుదల చేస్తామన్నారు. కానీ ఏప్రిల్ లో రాజాసాబ్ రాదని ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోయారు. చిత్రబృందం జూన్, జులై వైపు చూస్తోంది. ఇప్పుడు అది కూడా డౌటే. ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని, ఈ యేడాది చివర్లోగానీ విడుదల కాదని గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చిత్రబృందం కూడా సైలెంట్ గా ఉంది.
ఈ వేసవిలో రావాల్సిన ఈ మూడు పెద్ద సినిమాలూ ఇప్పుడు వాయిదా ప్రమాదంలో పడ్డాయి. అదే జరిగితే… ఈ వేసవిలో అసలైన కిక్ మిస్ అయిపోయినట్టే. ఇవి మూడూ మినహాయిస్తే బడా స్టార్ సినిమా ఏదీ ఈ సీజన్లో రావడం లేదు. ఇక మీడియం రేంజ్ సినిమాలే పెద్ద దిక్కు అనుకోవాలి.