ఎన్డీఏ రూపంలో చంద్రబాబు తెలంగాణలోకి వస్తున్నాడని ఇటీవల కేసీఆర్ చేసిన ప్రకటన .. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను మిక్స్ చేసి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తెలంగాణలో జరగబోయే రసవత్తర రాజకీయ నాటకానికి ముందు మాటను.. కొత్త పలుకు ద్వారా రాసేశారు. అదేమిటంటే.. తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కానుంది. ఇందులో కూడా టీడీపీ, జనసేన ఉంటాయి. వచ్చే ఎన్నికల కూటమి ఎన్డీఏ కూటమిగానే పోటీ చేస్తారు. అది సక్సెస్ ఫుల్ ఫార్ములా అవుతుందని అంటున్నారు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తా.. జనంలోకి వస్తా అంటున్నారని చెబుతున్నారు.
ఆర్కేకు అంతర్గత సమాచారం ఏమీ లేదు కానీ.. జరుగుతున్న రాజకీయాల్ని విశ్లేషించి ఆయన ఎన్డీఏ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను డీకోడ్ చేస్తే.. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది. కానీ దక్షిణ తెలంగాణలో వీక్ గా ఉంది. అదే దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ పరిధిలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. అలాగే జనసేనకూ బలం ఉంటుంది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలో బీజేపీ.. దక్షిణ తెలంగాణలో కూటమి బలం కలసి వస్తుందని.. గెలుపు సులువు అవుతుందని లెక్కలేస్తున్నారు.
ఈ విషయంపై కేసీఆర్ కూ అవగాహన ఉంది కాబట్టే ఆయన ఇక ప్రజల్లోకి రాకపోతే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారని అసెంబ్లీకి రావడమే కాదు.. ఇక ప్రజల్లో ఉండాలనుకుంటున్నారని ఆర్కే చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబుపై వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీతో కలిసి పోటీ చేసేదుకు బీఆర్ఎస్ సిద్దమైనప్పటికీ బీజేపీ సిద్ధంగా లేదంటున్నారు. అసలు కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోందని ఆర్కే భావన. అందుకే బీఆర్ఎస్ కంటే టీడీపీతో కలిసేందుకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు.
చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీ పై అదే పనిగా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నీళ్లు తీసుకెళ్తున్నారని అంటున్నారు. కానీ దిగువ రాష్ట్రంపై ఎగువ రాష్ట్రం ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారా అన్నదే కీలకం. చంద్రబాబు మాత్రం ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. గోదావరి మీద కావాల్సినన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలనుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ వ్యూహం .. దీర్ఘలికాలికంగా ఉంటుంది. ప్రభుత్వాలను ఇన్ స్టంట్ గా పడగొట్టినా.. తమ పార్టీ అధికారంలోకి రావాలంటే ఓ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుని దాని ప్రకారం వ్యూహాలు అమలు చేసుకుంటూ పోతారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీజేపీ చివరి క్షణంలోతీసుకున్న నిర్ణయాలు చాలా వరకూ కారణం అని రాజకీయవర్గాలు నమ్ముతాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి చేయాల్సింది చేయకుండా ఉంటారా? ఆర్కే కూడా ఇదే చెబుతున్నారు.