తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చిరాకుపుట్టి.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అనుకునేలా చేయడంలో ఆ పార్టీ హైకమాండ్ సక్సెస్ అవుతుంది. పార్టీ గురించి పట్టించుకోరు. ఏం చెప్పినా వినిపించుకోరు. పదవుల్ని భర్తీ చేయరు. ఏమైనా అంటే ఢిల్లీ రావాలంటారు.. వెళ్తే పట్టించుకోరు. పీకల మీదకు వచ్చేసింది నిర్ణయాలు తీసుకోవాలంటే ఫోన్లలో మాట్లాడదాం అంటారు. మామూలు రోజుల్లో ముఖ్యమంత్రిని కూడా రావాలని కబురు చేసి రోజంతా వెయిట్ చేస్తారు. కానీ అత్యవసర సందర్భాల్లో మాత్రం అందుబాటులో ఉండరు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కోసం .. కాంగ్రెస్ ముఖ్యనేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇంత వరకూ ఫలించలేదు.
నామినేషన్ల గడువు చివరికి వచ్చినప్పటికీ ప్రాబబుల్స్ ను కూడా ఖరారు చేయలేదు. ఓ వైపు మజ్లిస్ మరో వైపు సీపీఐ ఓ ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకోవడానికి కూడా నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఆదివారం వస్తే అభ్యర్థులపై మాట్లాడుకుందామని హైకమాండ్ తరపున పెద్దగా వ్యవహరించే కేసీ వేణుగోపాల్ చెప్పారు.కానీ ఆయన ఆదివారం ఢిల్లీలో ఉండట్లేదు. ఫోన్లో మాట్లాడుకుందామని చెప్పారు.
మామూలు రోజుల్లో అయితే… అవసరం లేకపోయినా ఈగో కోసం అయినా సరే ముఖ్యమంత్రుల్ని ఢిల్లీ పిలిపించుకుంటారన్న ఆరోపణలు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలపై ఉన్నాయి. ఇప్పుడు అత్యంత కీలక విషయాల్లో మాత్రం అందుబాటులో ఉండటం లేదు. నిర్ణయాలు తీసుకోవడానికి రేవంత్ కూడా ఇబ్బందికరంగా మారుతోంది. కనీసం మంత్రి పదవుల్ని భర్తీ చేయలేకపోతున్నారు. కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేకపోతున్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలను కూడా ఖరారు చేసుకోలేకపోతున్నారు.