ఓడిపోయేపార్టీలో పట్టుబట్టి మరీ చేరుతారని ప్రచారం ఉన్న దాసోజు శ్రవణ్ కు ఈ సారి అదృష్టం కలసి వస్తోంది. బీఆర్ఎస్కు ఎమ్మెల్యే కోటాలో లభించే ఒకే ఒక్క సీటును కేసీఆర్ దాసోజు శ్రవణ్ కే కేటాయించారు. ఆర్ఎస్ ప్రవీణ్ పేరు చివరి వరకూ రేసులో ఉన్నా కేసేఆర్ మాత్రం దాసోజు శ్రవణ్ వైపు మొగ్గుచూపారు.
దాసోజు శ్రవణ్ ఇప్పటికే ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో ఆయన పేరును బీఆర్ఎస్ హయాంలోనే సిఫారసు చేశారు. కానీ అప్పటి గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ ఆ పేర్లను వెనక్కి పంపిచాంచారు. అవే పేర్లను మళ్లీ పంపించి ఉంటే తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చేది. అయితే కేసీఆర్ పంపలేదు. అలా ఉండగానే ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తన నేతలతో ఆ రెండు స్థానాలను భర్తీ చేసేసింది. ఆ పదవులు తమవేనని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసినా ప్రయోజనం లభించలేదు.
ఇప్పుడు కేసీఆర్ ఆయనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు. వచ్చిన ఒక్క సీటు అవకాశాన్ని దాసోజుకు ఇచ్చారు. మంచి వాగ్దాటి ఉన్న ఆయన.. పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తారు. పవన్ కల్యాణ్ కు సన్నిహితుడిగా పీఆర్పీలో తన ప్రస్థానం ప్రారంభించారు. కానీ పీఆర్పీ సమైక్య రాష్ట్ర విధానం తీసుకోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన సామాజికవర్గం బలంగా లేనందున బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఓ సారి ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు కానీ పరాజయం తప్పలేదు.
రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఆయనతో సరిపడలేదు. బీజేపీలో చేరారు. కానీ అక్కడా ఉండలేకపోయారు. మళ్లీ బీఆర్ఎస్లో చేరి తన వాదన వినిపిస్తున్నాయి. చదువుకున్న, మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నేత కావడంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం గట్టి వాయిస్ వినిపిస్తారని భావించి కేసీఆర్ అవకాశం కల్పించారు.