అధికార కూటమిలో భాగంగా జనసేన పార్టీ .. అధికార పార్టీ హోదాలో తొలి సారి ప్లీనరీని నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పద్నాలుగో తేదీన నిర్వహించబోతున్న ఈ ప్లీనరీ కోసం ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. లక్షల మంది హాజరవుతారు కాబట్టి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్లీనరీ వేదిక నుంచి పవన్ కల్యాణ్ తమ పార్టీ క్యాడర్ కు భవిష్యత్ సందేశం ఇవ్వనున్నారు. పదిహేనేళ్లు కూటమిగా కలసి పని చేయాల్సి ఉంటుందని ఆయన ఇప్పటికే సూచనలు ఇచ్చారు. అదే సమయంలో కొంత మంది పార్టీ నేతలు తాము అధికార పార్టీ భావన ఉన్న అంశంతో దూకుడుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి వివాదాస్పదమవుతున్నాయి. దీన్ని పవన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. అధికార పార్టీగా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలని దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి పార్టీలతో సమన్వయానికి రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉంది.
జనసేన ఆవిర్భావం తర్వాత పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు ఎలాంటి విజయాలను చూడలేకపోయారు. కూటమిగా మారిన తర్వాత తిరుగులేని విజయం సాధించారు. వైసీపీకి పరాజయం బదులు ఘోర పరాజయం ఎదురవడానికి .. పవనే కారణం. అయినా పవన్ ను ఇంకా కించపర్చడానికి వైసీపీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఈ కారణంగా పిఠాపురం వేదికగా వారందరికీ పవన్ గట్టి కౌంటర్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.