తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తీరిపోయే మార్గం ఒకటి దొరికింది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ వంటి సంస్థలకు కేటాయించిన భూములు వివాదాల్లో పడి ఎటూ కాకుండా మిగిలిపోయాయి. ఇప్పుడు కోర్టు కేసుల నుంచి బయటపడటంతో వాటిని అమ్మి పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకోవాలనుకుంటోంది. ఇందులో నాలుగు వందల ఎకరాలను సిద్ధం చేసింది.
గచ్చిబౌలికి అనుకుని ఉన్న కంచగచ్చిబౌలిలో ఈ భూములు ఉన్నాయి. నేరుగా వేలం వేస్తే ఎంత వస్తుందో తెలియదు కానీ.. అభివృద్ధి చేసి గజాల లెక్కన అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించి ఇందు కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా చేయడం వల్ల కనీసం నలభైవేల కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. నిజానికి ఈ భూముల్ని తాకట్టు పెట్టేసి ఇప్పటికే అప్పులు తీసుకున్నారు. అమ్మేసి ఆ అప్పులు తీర్చడంతో పాటు ఇంకా పలు పథకాల కోసం నిధులు అందుబాటులోకి వస్తాయి.
అయితే భూముల అమ్మకం అంటేనే అనేక న్యాయపరమైన వివాదాలు వస్తాయి. అడ్డుకునేందుకు చాలా మంది పిటిషన్లు వేస్తారు. ఇప్పుడు వీటిపైనావస్తాయి. వీటన్నింటినీ అధిగమించి అమ్మగలిగితే.. గచ్చిబౌలి ప్రాంతంలో మరో అతి పెద్ద కాలనీ ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ భూముల్ని కొనేందుకు పోటీపడే అవకాశం ఉంది.అయితే నేరుగా ప్రజలు కూడాపోటీ పడేలా ప్లాట్ల రూపంలో చేసి అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఈ భూముల వేలం ప్రక్రియ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం కన్సల్టెన్సీల నియామకం కోసం ప్రక్రియ ప్రారంభించింది.