ఫార్ములా ఈ రేసు కేసులో ప్రస్తుతం విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ..కేటీఆర్ కు మాత్రం అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాల అప్ డేట్స్ తెలుస్తూనే ఉన్నాయి. తనకు పదిహేడే తేదీన నోటీసులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు నోటీసులు ఇస్తారని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసులకు భయపడబోనన్నారు.
తనపై పెట్టింది ఖచ్చితంగా లొట్టపీసు కేసేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేసు వల్ల ఎంత లాభం జరిగిందో తాను నిరూపిస్తానన్నారు. ఇప్పుడు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తామంటున్నాదని దాని వల్ల లాభమేంటో చెప్పాలన్నారు. హైకమాండ్ వద్ద రేవంతక్ రెడ్డి పని అయిపోయిందని ఆయనను కలిసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని తెలిపారు. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోలేకపోయారన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ స్థాయి వేరని.. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు ఎవరూ సరిపోరన్నారు.కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఓ కుమారుడికి తన ఆలోచన అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ మాటల్ని బట్టి చూస్తే.. ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. మిగిలిన రోజుల్లో రాకపోవచ్చని చెబుతున్నారు.