వంద కోట్లతో మంచు విష్ణు ‘కన్నప్ప’ తీస్తున్నాడంటే అంతా వేళాకోళం చేశారు. ‘ఈ సినిమాకు వంద కోట్ల మార్కెట్ వుందా’ అని ఇంకొంత మంది ఆశ్చర్యపోయారు. అయితే.. తన టీమ్‌లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ని తీసుకొచ్చి, ఓ హైప్ క్రియేట్ చేయగలిగాడు. ఇటీవల విడుదలైన శివుడి పాటకు మంచి రీచ్ వచ్చింది. నిజంగానే పాట బాగుంది. సాహిత్యం, ట్యూన్ బాగా కుదిరాయి. దాంతో `కన్నప్ప`పై కాస్త రెస్పెక్ట్ పెరిగింది. ఈ సినిమాతో విష్ణు ఏదో ట్రై చేస్తున్నాడులే అని భరోసా కుదిరింది.
ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ప్రేమ గీతం విడుదలైంది. శ్రీమణి రాసిన పాట ఇది. ట్యూన్ సింపుల్ గా వుంది. మంచి మెలోడీ సెట్ అయ్యింది. పదాలన్నీ అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. సాధారణంగా మైథలాజికల్ సినిమా అనగానే గ్రాంధిక భాష వాడతారు. కానీ ఈ పాటలో ఆ లక్షణాలు కనిపించలేదు. అయితే రొమాన్స్ పాళ్లు మాత్రం ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. విష్ణు డ్రస్సింగ్ ఓకే కానీ, కథానాయిక వస్త్రాధరణ కాస్త విచిత్రంగా ఉంది. మైథలాజికల్ సినిమానే అయినా, ఆ ఛాయలు లేవు. లొకేషన్లు బాగున్నాయి. ప్రభుదేవా నృత్య రీతులు అందించారు. మెలోడీ పాటని కూడా ఆయన బాగా కంపోజ్ చేస్తారు. ఆయన మార్క్ వెండి తెరపై కనిపిస్తుందేమో చూడాలి.
‘భక్త కన్నప్ప’లో భక్తి మాత్రమే చూపించారు. ఈసారి భక్తితో పాటు కన్నప్పలోని యుద్ధ వీరుడ్ని కూడా చూపించబోతున్నామని విష్ణు చెప్పేశాడు. భక్తితో పాటు రక్తి కూడా ఉందని ఈ పాట చూశాక అర్థమైంది. ఇక విమర్శకులు ఏమంటారో?