తెలుగు ప్రేక్షకుల అదృష్టం ఏమిటంటే… హీరోల్లో దాదాపుగా అందరూ మంచి డాన్సర్లే. పాటని తమ స్టెప్పులతో నెక్ట్స్ రేంజ్కి తీసుకెళ్తారు. ఆ హీరోల అదృష్టం ఏమిటంటే… ఇక్కడ మంచి కొరియోగ్రాఫర్లు ఉండడం. జానీ, శేఖర్ లాంటి వాళ్లు టాప్ రేంజ్లో ఉన్నారు. జానీ మాస్టర్ తన వ్యక్తిగత పరిస్థితుల వల్ల కాస్త డౌన్ అయ్యారు కానీ, శేఖర్ మాస్టర్ హావా మాత్రం తగ్గలేదు. ఆయన అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కొరియోగ్రాఫర్. పెద్ద హీరోల దగ్గర్నుంచి, యంగ్ స్టర్స్ వరకూ అందరికీ శేఖర్ మాస్టరే కావాలి. దానికి తగ్గట్టే.. గుర్తుండిపోయే స్టెప్పులు కంపోజ్ చేస్తారాయన. మధ్యమధ్యలో కొన్ని కాంట్రవర్సీలూ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన చేయించిన కొన్ని మూమెంట్స్ వివాదాస్పద మయ్యాయి. ‘మిస్టర్ బచ్చన్’, ‘డాకూ మహారాజ్’లలోని హుక్ స్టెప్పులు కొంత అసభ్యంగా ఉన్నాయన్న విమర్శ వచ్చింది. ఇప్పుడు `రాబిన్వుడ్` సినిమా నుంచి ఓ పాట విడుదలైంది.
‘అదిదా సర్ప్రైజు’ అనే పాట కేతిక వర్మపై తెరకెక్కించారు. పాట బాగుంది. అందులో స్టెప్పులు మంచి క్రేజీ ఉన్నాయి. కేతిక కూడా హుషారుగా చిందులేసింది. అయితే.. ఓ హుక్ స్టెప్ మాత్రం విమర్శలకు దారిచ్చింది. ఆ హుక్ స్టెప్ చూసి ‘శేఖర్ మాస్టర్ ఈమధ్య శ్రుతి మించుతున్నాడేంటి’ అనుకొంటున్నారంతా. సిగ్నేచర్ స్టెప్పుల్లో కొత్తదనం వెదుక్కోవడం వరకూ ఓకే. కానీ అసభ్యంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అమ్మాయిలతో ఇలాంటి స్టెప్పులు వేయిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది ఐటెమ్ పాటే అయ్యి ఉండొచ్చు కాగ. అలాగని హద్దులు మీర కూడదు కదా? శేఖర్ మాస్టర్ కంపోజీషన్ చాలా అందంగా ఉంటుంది. అలాంటి డాన్స్ మాస్టర్ ఇలాంటి స్టెప్పుల్ని కంపోజ్ చేయడం ఎందుకో? వెంకీ కుడుముల సినిమాలు ఫ్యామిలీ చూసేటట్టు ఉంటాయి. ఆయన అంత స్వచ్ఛమైన వినోదం అందిస్తారు. అలాంటప్పుడు తన సినిమాల్లో ఇలాంటి అపశ్రుతులు దొర్లకుండా చూసుకొంటే బాగుంటుంది.
సినిమాని సినిమాలానే చూడాలి, రంధ్రాన్వేషణ ఎందుకు? అని వాదించే గొప్ప కళాహృదయులు ఉండొచ్చు గాక. ఈనాటి రోజుల్లో పాటలు పాటలుగా ఉండడం లేదు. అవి రీల్స్ రూపంలో షార్ట్స్ రూపంలో తెగ వైరల్ అవుతున్నాయి. తెరపై హీరో, హీరోయిన్లు వేస్తున్న స్టెప్పుల్ని చిన్న చిన్న పిల్లలు కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లందరినీ ఇలాంటి స్టెప్పులు తప్పుదోవ పట్టించే ప్రమాదం వుంది.