విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు గట్టి షాక్ తగిలింది. హయగ్రీవ భూముల కేటాయింపును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. వృద్ధుల కోసం కేటాయించిన స్థలాలను రియల్ ఎస్టేట్ కోసం వాడుకున్నారని ప్రభుత్వం గుర్తించడంతో వీటి కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు దీంతో అత్యంత ఖరీదైన ఊ భూములు ప్రభుత్వ పరం అయ్యాయి
వైఎస్ మొదటి సారి సీఎంగా ఉన్నప్పుడు హయగ్రీవ సంస్థకు చెందిన జగదీశ్వరుడు అనే వ్యక్తి వృద్ధుల సంక్షేమం కోసం అంటూ భూములు కేటాయింపచేసుకున్నారు. పన్నెండు ఎకరాలకుపైగా కేటాయించారు. అయితే ఆయన ఆ స్థలంలో భూములకు సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. ఆ భూములు అలా ఉన్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఆ భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. జగదీశ్వరుడి నుంచి ఆ భూములు ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీ వంటి వారు రాయించుకున్నారు. తనతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు.
వైసీపీ హయాంలో మొత్తం ఎంవీవీ గుప్పిట్లో ఉంది. ప్రభుత్వం మారగానే జగదీశ్వరుడు మళ్లీ కేసు పెట్టారు. తర్వాత ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎంవీవీతో పాటు పలువురు ఇళ్లల్లో సోదాలు చేసింది. ఇటీవల పలు ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా భూముల కేటాయింపు రద్దు చేయడం సంచలనంగా మారింది. ఈ భూముల్లో వైసీపీ పెద్దలకు చెందినవారికి బినామీ వాటాలు ఉన్నట్లుగా అనుమానాలున్నాయి.