అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు గంటల పాటు అసెంబ్లీలో ఎలా పోరాడాలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రజల కష్టాలన్నింటినీ చెప్పి.. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలని కర్తవ్యబోధ చేశారు. ఈ పోరాటానికి ముందు ఉండేలా బీఆర్ఎస్ఎల్పీకి డిప్యూటీ లీడర్లను కూడా నియమిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ఎల్పీ నేత, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు.
డిప్యూటీ లీడర్లను నియమిస్తామని చెప్పడంతో కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. తాను అసెంబ్లీకి వస్తానని ప్రభుత్వాన్ని అందరం కలిసి చెండాడుదామని ఆయన చెప్పలేదు. ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. కానీ అనర్హతా వేటు తప్పించుకోవడానికి కేవలం ఒక్క రోజు .. జగన్ తరహాలో హాజరువుతారన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆ తర్వాత ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయే అవకాశం ఉంది.
డిప్యూటీ లీడర్లుగా కేటీఆర్, హరీష్ రావులను నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇతర వర్గాలకు అవకాశం కల్పించరా అన్న ప్రశ్నలు వస్తాయి. ఎవర్ని నియమించినా అసెంబ్లీలో పోరాటం వీరిద్దరి కనుసన్నల్లోనే జరుగుతుదంని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కు ఎవరు సమాధానం ఇచ్చినా ఎఫెక్టివ్ గా ఉండదని.. కేసీఆర్ కౌంటర్ ఇస్తే ఆ హైప్ వేరుగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ సారి కూడా హాజరవ్వాలని అనుకోవడం లేదు.