ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గంలో చేసిన మార్పులకు సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అవి ప్రమోషన్లా డిమోషన్లా తెలియని విధంగా కొందరు మాట్లాడారు. ఏది ఎలా వున్నా ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ప్రభుత్వమంటే నేనేనని చాటుకోవడానికి ఆయన ఈ అవకాశం తీసుకున్నారు. తనకు గతంలో సమవుజ్జీలుగా లేక పోటీ అభ్యర్థులుగా భావించబడిన సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలకు కొంత తడాఖా చూపించారు. ఎంజెఅక్బర్ను విదేశాంగ శాఖ సహాయమంత్రిగా తీసుకోవడం సుష్మకు రుచించని విషయం. అరుణ్జైట్లీనుంచి ఆకర్షణీయమైన సమాచార శాఖను తీసుకోవడం కూడా కొంత కోతలాటిదే. ఇక ఆ శాఖను వెంకయ్య నాయుడుకు ఇవ్వడం పెద్ద ప్రమోషన్లా ప్రచారం చేస్తున్నారు గాని పార్లమెంటరీ వ్యవహారాలతో పోలిస్తే అది ప్రచార ప్రధానమైంది మాత్రమే. బిజెపి ఆరెస్సెస్ భావజాలాన్ని అదేపనిగా చెప్పడంలో వెంకయ్యను మించిన వారు లేకపోవచ్చు. అయితే సరిగ్గా ఆ పని చేసిన సృతి ఇరానీని మానవ వనరుల శాఖ నుంచి తప్పించడం చూస్తే ఆయన జాగ్రత్త పడాల్సి వుంటుంది. కన్నయ్య కుమార్‌పై దాడిలో గాని హెచ్‌సియు విషయంలో గాని సృతితో సమానంగా ఆవేశపడిన వ్యక్తి వెంకయ్య నాయుడే. పార్లమెంటులో పదే పదే మోడీని ఆదుకున్న వ్యక్తిగా వెంకయ్య పేరు రావడం కూడా అధినేతకు రుచించివుండకపోవచ్చు. పైగా ఈ మార్పుల సమయంలో టాప్ నాలుగు శాఖలు అంటుకోలేదని ఒకటికి రెండు సార్లు వచ్చిన పేర్లలో ఆయన పేరు లేకపోవడం ఆయన టాప్‌లో లేరని సంకేతం ఇవ్వడం లాటిదే. మాజీ సైనాధిపతిగా వుండి మంత్రి పదవి పొందిన వికెసింగ్‌ను స్వతంత్ర బాధ్యతల నుంచి తప్పించి సహాయ హౌదాకు పరిమితం చేయడం గతంలో ఎన్నడూ ఎరుగని డిమోషన్. మరో మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఏడు పర్యాయాలు గెలిచిన ఎంపి.వాజ్‌పేయి హయాంలోనే స్వతంత్ర హౌదాలో పనిచేశారు. కాని ఇప్పుడు ఆయనను తగ్గించి సహాయమంత్రిని చేశారు. అంతే స్వతంత్ర మంత్రికింద పనిచేయాలన్న మాట. ఈ దఫా మార్పులలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు వివాదాలకు కారణమైన వారిని తగ్గించాలని మోడీ భావించినట్టు కనిపిస్తుంది. విద్యార్థుల సమస్యలపై సృతి, హర్యానాలో దళితులను చంపినప్పుడు కుక్కలతో పోలుస్తూ మాట్లాడిన వికెసింగ్ వంటివారిని కావాలనే తగ్గించారు.
అయితే ఇంకా వివాదాస్పదమైన మతతత్వ వ్యాఖ్యలు చేసిన కొందరిని వదిలేశారంటే అదొక్కటే కారణం కాదని అర్థమవుతుంది. అవసరమైనప్పుడు ఇమేజి కల్పిస్తాం, తర్వాత డామేజి తగ్గించే చర్యలు తీసుకుంటాం అని బిజెపి నాయకులొకరు అన్నారు. ఈ పాత్రధారులు మారుతుంటారు గాని పాత్రలు కొనసాగుతుంటాయన్నమాట. భేష్!