హిచ్ కాక్ గుర్తున్నాడు కదా?
మర్చిపోవడానికి ఆయనో మనిషా… వెండితెర పై ఓ అందమైన రక్తపు జ్ఞాపకం.
సస్పెన్స్ సినిమాలు చూసినప్పుడల్లా ఆయనే గుర్తొస్తాడు.
‘అరె… ఇది హిచ్ కాక్ ఐడియాలా ఉంది’ అనో,
‘హిచ్ కాక్.. ఈ షాట్ ఎప్పుడో తీసేశాడు’ అనో,
‘అసలు ఈ కథని హిచ్ కాక్ తీసి ఉంటేనా’ అనో… అనుకోవడం రివాజు.
అందుకే ఆయన మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అయ్యారు.
ఎప్పుడో వందేళ్ల క్రితం సినిమాలు తీసిన మనిషి. తరాలు మారిపోయాయి. అభిరుచులు మారిపోయాయి. ప్రేక్షకులు మారిపోయారు. అంతెందుకు.. సినిమానే మారిపోయింది. కానీ హిచ్కాక్ పై ప్రేమ మాత్రం మారలేదు. ఎంతటి ఉద్దండుడైన దర్శకుడైనా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నో, మర్డర్ మిస్టరీనో తీయాలంటే ఇప్పటికీ హిచ్ కాక్ని తిరగేయాల్సిందే. రియర్ విండో, ఫ్యామిలీ ప్లాట్, వెర్టిగో, డయల్ ఎం.ఫర్ మర్డర్, షాడో ఆఫ్ ది డౌట్, యంగ్ అండ్ ఇన్నోసెంట్, టు క్యాచ్ ఏ థీఫ్, నెంబర్ 17…. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్లు. సాధారణంగా సస్పెన్స్ సినిమాలకు రిపీట్ ఆడియన్స్ ఉండరు. చిక్కుముడి తెలిసిపోయిన తరవాత… మరోసారి సినిమా చూడాలంటే బోర్. కానీ హిచ్ కాక్ సినిమాలు ఇందుకు మినహాయింపు. రెండోసారి… ఆరోసారి.. పదహారో సారి చూసినా అదే ఫీల్. ఒకసారి హిచ్ కాక్ ఏం చెప్పాడో చూడాలనిపిస్తుంది. ఇంకోసారి ఎలా చెప్పాడో తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకోసారి ఆ షాట్ మేకింగ్ కోసమో, లైటింగ్ పేట్రన్ కోసమో వన్ మోర్ అనాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా అదే థ్రిల్, అంతే… ప్రేమ. అలా హిచ్ కాక్ మాత్రమే తీయగలడు.
సస్పెన్స్ సినిమాలంటే అతనికి ఎందుకు అంత మక్కువో?! రక్తపు మరకంటే ఎందుకంత ప్రేమో..? అర్థం కాదు. తీయడమే కాదు.. చూడడం కూడా ఇష్టమే ఆయనకు. అందుకే
”FILM YOUR MURDERS LIKE LOVE SCENES & FILM YOUR LOVE SCENES LIKE MURDERS” – అంటూ హితబోధ చేస్తాడు.
వంశీ సినిమాల్లో గోదావరి కనిపించకపోతే తెలుగు ప్రేక్షకుడు ఎంత హర్టవుతాడో, హిచ్ కాక్ సినిమాలో శవం కనిపించకపోతే ప్రపంచ ప్రేక్షకుడు అంతే ఇబ్బంది పడిపోతాడు. అది ఆయన మార్క్.
హిచ్ కాక్ ప్రభావం చాలామందిపై ఉంది. చాలామంది దర్శకులు ఆయన్ని గుడ్డిగా అనుసరించారు. చాలామంది కథకులు ఆయన అడుగు జాడల్లో నడిచారు. తెలుగులోనూ హిచ్ కాక్ వీర భక్తులు ఉన్నారు. వాళ్లు దర్శకులు కావొచ్చు, రచయితలు కావొచ్చు, జర్నలిస్టులు కావొచ్చు. వాళ్లంతా హిచ్ కాక్ని వాళ్ల వాళ్ల దృక్పథాల్లోంచి, అనుభవాల్లోంచి ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన పుస్తకం `మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్`. పులగం చిన్నారాయణ, రవిపాడి తీసుకొచ్చిన సంకలనం ఇది. హిచ్ కాక్ గురించి 45 మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పదిమంది పాత్రికేయులు రాసిన వ్యాసాల్ని గుది గుచ్చిన అపురూపమైన పుస్తకం ఇది.
రియర్ విండో గురించి సింగీతం రాశారు.
సైకో సంగతులు వంశీ వివరించారు.
టు క్యాచ్ ఏ థీఫ్ సినిమాని పూరి అక్షరాల్లో చూపించారు.
హరీష్ శంకర్, ఇంద్రగంటి మోహన కృష్ణ, తనికెళ్ల భరణి, ప్రశాంత్ వర్మ, శివ నాగేశ్వరరావు, చంద్ర సిద్దార్థ్, వి.ఎన్.ఆదిత్య.. అంతా ఉద్దండులే.
అందరూ హిచ్ కాక్ సినిమాల గురించి ఏకరువు పెట్టకుండా ఒకొక్కరూ ఒక్కో సినిమాని ఎంచుకోవడం బాగుంది. కొన్ని వ్యాసాలు చదువుతుంటే ‘ఓహో..వాళ్లకు ఈ సినిమా ఇలా అర్థమైందా’ అనిపిస్తుంది. ఇంకొన్ని చదివితే ‘ఇలాక్కూడా ఈ సినిమాని అర్థం చేసుకోవచ్చా’ అనే జ్ఞాన బల్బు వెలుగుతుంది.
అన్నీ ఒక ఎత్తు… మల్లాది గారి ముందు మాట మరో ఎత్తు. నిజానికి ఆయన ముందు మాట… ముందుమాటలా రాయలేదు. ఓ మినీ బయోగ్రఫీలా రాశారు. హిచ్ కాక్ సినిమాలు, ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు అన్నీ కలిపి సంక్షిప్తంగా అందించారు. మల్లాది రాతలో హిచ్ కాక్పై ఉన్న అపారమైన ప్రేమ, భక్తి కనిపిస్తాయి.
ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు సినిమా రంగానికి చాలా అవసరం. సినిమా సాహిత్యాన్ని చాలామంది చిన్నచూపు చూస్తారు. సినిమాలే వేస్టు, వాటి కోసం రాసిన పుస్తకాలు ఇంకా వేస్టు అనే ధోరణి చాలామందికి ఉంది. సినిమా అంటే వినోదం ఒకటే కాదు. విజ్ఞానం కూడా. అంతకు మించి చరిత్ర. ఓ సినిమా గురించి రాశామంటే.. కచ్చితంగా ఏదో ఒక రోజు చరిత్ర అవుతుంది. ఓ మహా దర్శకుడు తీసిన సినిమాలన్నింటి గురించి రాశారంటే.. కచ్చితంగా భవిష్యత్తులో ఓ శాసన గ్రంధంలా మారుతుంది. ముఖ్యంగా సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు. ఆ లక్షణం ఈ పుస్తకానికి ఉంది. ఇంత మంచి ప్రయత్నం చేసిన పులగం చిన్నారాయణ, రవి పాడి అభినందనీయులు.
(ఈరోజు నేషనల్ హిచ్కాక్ డే సందర్భంగా)