వైసీపీ విషయంలో తన మనసు విరిగిపోయిందని.. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని విజయసాయిరెట్టి చెప్పుకొచ్చారు. వైసీపీలోకి చేరే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. విజయవాడలో సీఐడీ ఎదుట హాజరైన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయంగానే కాదు అటు కేసుల పరంగా కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే బయటకు !
జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే తాను వెళ్లిపోయానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. నిజానికి విజయసాయిరెడ్డి కోటరీలో ఒకప్పుడు ఆయన కీలక వ్యక్తి. తర్వాత ఆయన దూరమైపోయి.. ఇతరులు జగన్ చుట్టూ చేరారు. ఇప్పుడు ఆ కోటరీ మాటలు విని జగన్.. విజయసాయిరెడ్డిని దూరం పెట్టారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఆ కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులు అని చెప్పాల్సిన పని లేదు. నాయకుడు అనే వాడు చెప్పుడు మాటల్ని నమ్మకూడదన్నారు. అలా నమ్మడం వల్ల పార్టీ నష్టపోతుంది.. నాయకుడు నష్టపోతారన్నారు. తనను జగన్ పార్టీలో కొనసాగాలని కోరారనన్నారు. అయితే అప్పుడే.. తాను నేరుగా చెప్పానన్నారు. మీ చుట్టూ ఉండేవారి చెప్పుడు మాటలు విని తప్పుడు దారి పట్టవద్దని చెప్పానన్నారు ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్దాలు చెబుతున్నారో తెలుసుకోవాలన్నారు. మీ చుట్టూ ఉన్న వారి ఉన్న మాటలు వినవద్దు అని ఫోన్లో స్పష్టంగా చెప్పానని చెప్పుకొచ్చారు. ఘర్ వాసపసీ అనేది అసాధ్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ తాను ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పానని.. వ్యవసాయం చేసుకుంటున్నానన్నారు.
లిక్కర్ స్కాంలో అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే !
లిక్కర్ స్కాం గురించి కూడా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను గతంలో కూడా ఇదే చెప్పానని అంటున్నారు. ఈ విషయంలో తాను నిజాలు ఇక ముందు కూడా చెప్పాల్సి వస్తే మొత్తం చెబుతానని ప్రకటించారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనన్నారు. ఎవరికీ భయపడేది లేదన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే… లిక్కర్ స్కాం చేశారని ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికీ సీఐడీ గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
పోర్టు వ్యవహారం అంతా విక్రాంత్ రెడ్డి కనుసన్నల్లోనే !
కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. కేవీరావుతో తనకు ముఖ పరిచయం మాత్రమే ఉందన్నారు. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డేనని జగన్ కు తనకు తెలిసినంత వరకూ సంబంధం లేదన్నారు. తన అల్లుడి వ్యాపారాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కేవీరావుకు.. వైవీ సుబ్బారెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. వారిద్దరూ ఆప్తులని వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కేవీ రావు ఇంట్లోనే బస చేస్తారన్నారు. ఈ పోర్టు వ్యవహారంలో అంతా విక్రాంత్ రెడ్డే చేశారని చెప్పుకొచ్చారు.
విజయసాయిరెడ్డి బయటే ఇన్ని మాటలు చెప్పారంటే.. ఇక సీఐడీకి ఎన్ని వివరాలు చెప్పి ఉంటారోనని వైసీపీ వర్గాల్లో కంగారు మొదయింది. తాను తనకు తెలిసిన నిజాలన్నీ చెబుతానని నిర్మోహమాటంగా చెబుతున్నారు.తన మనసు విరిగిపోయిందని అంటున్నారు. అంటే ముందు ముందు చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.