ఈవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి కోర్ట్ అయితే, రెండోది దిల్ రూబా. నాని నిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ పై మంచి బజ్ వుంది. వాల్ పోస్టర్ సినిమా నుంచి నాని తీసిన సినిమాలన్నీ మంచి విజయాలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. కోర్ట్ సినిమాపై కూడా నాని నమ్మకంతో ఉన్నాడు. అదెంతంటే.. ‘ఈ సినిమా నచ్చకపోతే.. నా రాబోయే హిట్ 3 చూడొద్దు’ అనేంతగా. ప్రమోషన్లు కూడా భారీగానే చేస్తున్నారు.
ఈ సినిమా విడుదలకు ముందే నాని లాభాల్లో ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హక్కుల్ని దాదాపు రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది మంచి రేట్. సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీతో కవర్ చేసేసినా లాభాల్లో ఉన్నట్టే. ఇప్పుడు శాటిలైట్ కూడా అయిపోయింది. ఈటీవీ విన్ దాదాపు రూ.2.5 కోట్లకు శాటిలైట్ దక్కించుకొందని తెలుస్తోంది. ఇదంతా లాభమే. దాంతో పాటు థియేటర్ నుంచి వచ్చిన ప్రతీ రూపాయీ నిర్మాత జేబులోకే. సో.. ఎలా చూసినా ‘కోర్ట్’ చాలా ప్రాఫిటబుల్ వెంచర్.
‘దిల్ రూబా’ పరిస్థితి మరోలా వుంది. ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. `క` తరవాత వస్తున్న సినిమా కాబట్టి రికవరీ ఆశించొచ్చు. అయితే ఓటీటీ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదు. ఇంకా బేరసారాల దగ్గరే ఉన్నారు. దాదాపు రూ.4 కోట్లకు ఓటీటీ డీల్ సెట్ అవ్వొచ్చు. హిందీ డబ్బింగ్ రూపంలో కొంత మొత్తం వచ్చింది. నైజాంలో మైత్రీ మూవీస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. మిగిలిన ఏరియాల్లో సొంతంగా విడుదల చేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ మొత్తం రిస్క్ లో ఉన్నట్టే. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయి. లేదంటే లేదు. ‘క’ తరవాత సినిమా కాబట్టి, యూత్ ఫుల్ కంటెంట్ వుంది కాబట్టి కొన్ని ఆశలు పెట్టుకోవచ్చు.