ప్రోటోకాల్ ను పక్కన పెట్టి, వెలగపూడికి స్వయంగా వచ్చిన గవర్నర్ నరశింహన్ హైకోర్టు విభజన వివాదంలో చేసిన మధ్యవర్తిత్వాన్ని, చెప్పిన సలహాను చంద్రబాబు నాయుడు గౌరవంగా తిరస్కరించారంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నంలో వున్న ఆయన్ని ఆభినందించలసిందే! స్ధలం కేటాయింపుతప్ప కోర్టు విభజనలో ఏప్రమేయమూ లేని ఎపి ప్రభుత్వం విభజన కోసం అదనపు చొరవ తీసుకుంటే మిగిలిన ఉమ్మడి సంస్ధల పంపకంలో తగాదాలను ఎవరు తీరుస్తారు? ఏమైనా చంద్రబాబు కోర్టు విభజనకు బాల్ ను గవర్నర్ ద్వారా కేంద్రం కోర్టులోకి విసిశారు.
న్యాయాధికారుల నియామకం హైకోర్టు పరిధిలోనిది. ఈ నియామకాలకు దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ అర్హులే. ఈ నియామకానికి స్థానికత గానీ , 371D గానీ వర్తించవు. తెలంగాణాలో సుమారు 250, ఆంధ్రాలో 350 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుత వివాదం ఏమిటంటే ఉమ్మడి హైకోర్టు చేసిన నియామకాల ప్రకారం 130 మంది ఆంధ్రా వారు తెలంగాణా కోర్టులలో ఉన్నారని , 30 మంది తెలంగాణా వారు ఆంధ్రాలో ఉన్నారనేది వాదన. తెలంగాణా,ఆంధ్రా ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా న్యాయాధికారులుగా వున్నారు.కేంద్ర ప్రభుత్వానికి కానీ , రాష్ట్ర ప్రభుత్వ నియామక సంస్థలకు కానీ ఎటువంటి ప్రమేయం ఉండదు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ద్వారా రాష్ట్రం , అధికారం రెండూ సంపాదించిన టిఆర్ఎస్ తెలంగాణా న్యాయవాదులకు అనుకూలమైన హైకోర్టు విభజన అంశంపై మద్దతుగా నిలిచింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని వివాదాల్లో హైకోర్టు నుండి ఎదురైన అడ్డంకులలో టిఆర్ఎస్ ప్రభుత్వం , గత రెండేళ్ళలో అసహనానికి గురైనా, ఆ తరువాత సర్దుకుంది.
ప్రస్తుతం హైకోర్టు విభజన గాని , నీటి వివాదాలు కాని, 9,10 షెడ్యూలు ఆస్తుల వివాదాలు కాని పరిష్కారం అవ్వడం కంటే , వివాదాలను, సెంటిమెంట్లను వచ్చే ఎన్నికల వరకు కొనసాగించడమే టిఆర్ఎస్ కు లాభదాయకం. అన్నివిషయాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమూ ఈ వైఖరినే పాటిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి , టిడిపి కుమ్మక్కై తెలంగాణాకు అన్యాయం చేస్తున్నాయనే ప్రచారం చేస్తున్నాయి .
హైకోర్టు విభజనతో సహా 9, 10 షెడ్యులలోని ఉమ్మడి ఆస్తుల పంపకంలో చిక్కుముడులను తెలంగాణా విప్పడంలేదు. ఉమ్మడి సంస్ధల ఆస్తులన్ని హైదరాబాద్ లోనే వుండిపోయాయి. తగాదా తేలితేగాని ఎపి వాటాలు ఎపికి రావు. పంపకాలు ఎంత త్వరగా తేమిలితే ఎపికి అంతలాభం… రెండు రాష్ట్రాల మధ్య ప్రతిష్టం భన ఏర్పడినపుడు రూలింగ్ ఇవ్వవలసిన బాధ్యతా అధికారమూ కేంద్రప్రభుతావానివే!
పెద్దరికాన్ని చూపవలసిన బిజెపి రాజకీయ లాభనష్టాల బేరీజులో తడబడుతున్నది. ఎపిలో ఎటూ తమ స్థానం అనుబంధ పార్టీనే కానీ ప్రధాన పార్టీ అయ్యే అవకాశం లేదు. అదే తెలంగాణాలో అయితే తెలగాణా ఇచ్చిన కాంగ్రెసు పార్టీ వెనుకబడి ఉంది. కాబట్టి ప్రధాన పార్టీగా అవతరించే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఆంధ్ర ,తెలంగాణా మధ్య వచ్చే విభేదాల తాలూకు భారాన్ని తెలుగుదేశంపై నెట్టివేస్తున్నది.
తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే, విభజన సమస్యలు పరిష్కారమైతే ప్రభుత్వ పరంగా పాలకులుగా ఉండే లాభం కన్నా , రెండు ప్రాంతాలలోనూ రాజకీయ ప్రయోజనాలు ఉండడం వలన విభేదాలు సమసి పోవడం అవసరం. అయితే రాజకీయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అంటే మళ్ళీ రాష్ట్ర విభజన మాదిరిగా ఆంధ్రకు అన్యాయం జరగవచ్చు తమకు కొత్త తలనెప్పులు కూడా రావచ్చు.
ముళ్ళకంచె మీద బట్టపడినట్టు హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఉమ్మడి ఆస్తుల నుంచి వాటాలు తెచ్చుకునే క్రమంలో అక్కరకు రాని బిజెపి కంటే, ఆడిపోసుకునే టిఆర్ఎస్ కంటే న్యాయ వ్యవస్థను నమ్ముకోవడమే మంచిది. 9, 10 షెడ్యూళ్ళలోని అన్ని అంశాల విభజన, పంపకాలు జరిగేవరకూ హైకోర్టు విభజన జరగకపోవడమే మంచిది.
చట్టాలపై ఆధారపడి మాత్రమే కోర్టులు తీర్పు చెప్పగలవు కాబట్టి నీటి సమస్యలు,9,10 షెడ్యూలు ఆస్తులు , పంపకం , ఉద్యోగాలు తదితరాలను హైకోర్టు విభజనతో ముడిపెట్టి , సుప్రీంకోర్టు పరిధిలోకి నెట్టివేయడమే రాజకీయంగా తెలుగుదేశానికి, హక్కుల పరంగా ఆంధ్రప్రదేశ్ కి మంచిది.