Court Movie Review
తెలుగు360 రేటింగ్: 3/5
‘కోర్ట్’ క్లైమాక్స్ లో ఓ డైలాగ్ గట్టిగా వినిపించింది. పిల్లలకు పాఠాలు నేర్పకపోయినా ఫర్వాలేదు, చట్టాలు మాత్రం నేర్పండి. తప్పు చేస్తే శిక్షించడం కాదు, అసలు ఏది తప్పో… చెప్పండి అని.
విలువైన, అర్థవంతమైన మాట ఇది. అవసరమైన మాట ఇది. చెప్పాల్సిన మాట ఇది. ఏ చట్టమైనా దుష్టుల్ని శిష్టించడానికీ, పీడుతుల్ని రక్షించడానికే అమలు చేస్తారు. కానీ అసలు చట్టం అనేది ఒకటి ఉందని, అది ఇలా పని చేస్తుందని అర్థమయ్యేలా చెప్పేవాళ్లే ఉండరు. ఉదాహరణకు ఫాక్సో చట్టం ఉంది. ఇందులోని సెక్షన్లు, సబ్ సెక్షన్లూ తలపండిన లాయర్లకే అర్ధం కావు. ఇక సామాన్య జనానికి ఏం తెలుస్తాయి? ఔరంగజేబు గురించో, అమెరికా గురించో తెలుసుకొనే ముందు – మన చట్టాల గురించీ, అందులోని క్లాజుల గురించీ క్లాసుల్లో చెప్పాలి. అప్పుడు కదా… ఏది తప్పో, ఏది ఒప్పో పిల్లలకు తెలుస్తుంది. ‘కోర్ట్’ చెప్పేది కూడా అదే.
న్యాయ వ్యవస్థ గురించి, అందులోని లొసుగుల్ని గురించి, వాటితో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించీ కొన్ని కథలు విన్నాం. ‘కోర్ట్’ కూడా అలాంటిదే. కాకపోతే.. చాలా విషయాల్లో తన ప్రత్యేకత నిలుపుకొన్న సినిమా ఇదీ.
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది. అక్కడ చందూ (రోషన్) అనే ఓ కుర్రాడున్నాడు. వయసు పందోమ్మిది ఏళ్లు. ఏదోలా కష్టపడి.. మంచి స్థాయికి వెళ్లాలని కలలు కంటుంటాడు. జాబిల్లి (శ్రీదేవి) అనే పదిహేడేళ్ల అమ్మాయి చందూని సరదాగా ఆట పట్టించడం మొదలు పెడుతుంది. ఆ తరవాత… ఇద్దరూ మెల్లగా ప్రేమలో పడిపోతారు. జాబిల్లి మేనమామ మంగపతి (శివాజీ) ఓ టైపు. పరువు కోసం ప్రాకులాడే వ్యక్తి. ఏం జరిగినా ఫర్వాలేదు, పరువు మాత్రం పోకూడదు. జాబిల్లికి తండ్రి లేకపోవడంతో పెత్తనమంతా తనదే. మంగపతి చెప్పినట్టే ఆ కుటుంబం వింటుంది. జాబిల్లి ప్రేమ కథ తెలుసుకొన్న మంగపతి తట్టుకోలేకపోతాడు. పోలీసుల్ని కొనేస్తాడు. చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని చందూపై లేని పోని కేసుల్ని బనాయించి అరెస్ట్ చేయిస్తాడు. 78 రోజుల పాట బెయిల్ లేకుండా రిమాండ్ లోనే ఉండిపోతాడు చందూ. చందూ తరపున వాదించే న్యాయవాది సైతం మంగపతికి అమ్ముడు పోతాడు. న్యాయస్థానం కూడా చందూని దోషి అని నిర్దారించి తుది తీర్పుకు సిద్ధం అవుతుంది. ఇలాంటి దశలోనే చందూ కేసు వాదించడానికి ముందుకొస్తాడు జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి). మరి నిండా మునిగిపోతున్న చందూని సూర్య కాపాడాడా? న్యాయం జరిగిందా? తప్పుడు కేసుల నుంచి చందూని తప్పించాడా? ఇదంతా ‘కోర్ట్’ రూమ్ లో జరిగే డ్రామా.
ఫాక్సో చట్టం గురించి చాలామందికి తెలీదు. ఇటీవల తెలుగు చిత్రసీమలో జరిగిన ఓ ఇన్సిడెంట్ తరవాత ఈ చట్టంపై కాస్తో కూస్తో అవగాహన కలిగింది. ‘కోర్ట్’ చూస్తే పూర్తిగా కలుగుతుంది. ఈ సినిమా కథంతా ‘ఫాక్సో’ చుట్టూ తిరిగేదే. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాన్ని దృష్టిలో ఉంచుకొని, కఠినంగా రూపొందించిన చట్టం ఇది. ఈ చట్టం వెనుక ఉద్దేశ్యాలు బలంగానే ఉండొచ్చు. కానీ కొంతమంది ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకొని అమాయకుల్ని ఇరికిస్తున్నారు. అలా ఇరికించాలంటే ఎలా ఉంటుందో, పర్యవసానాలు ఏమవుతాయో చెప్పిన సినిమా ‘కోర్ట్’. టీజర్, ట్రైలర్లలో ఈ సినిమా దేని గురించో, ఏం చెప్పబోతున్నారో ముందే హింట్ ఇచ్చేశారు. కాబట్టి కథ స్ట్రయిట్ గానే పాయింట్ లోకి వెళ్లిపోతుంది. ఈ కేసు సూర్య తేజ అనే జూనియర్ లాయర్ దగ్గరకు వెళ్లడం, అసలు ఏం జరిగిందో సూర్య ఆరా తీయడం, ఆ తరవాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవ్వడం ఇవన్నీ చక చక జరిగిపోతాయి. చందూ, జాబిల్లి ప్రేమకథలో అందమైన అమాయకత్వం కనిపిస్తుంది. నిబ్బా – నిబ్బీ ప్రేమ కథ అనగానే, ఆ వయసులో వాళ్ల రొమాన్స్, లస్ట్ చూపించడానికి మొగ్గు చూపిస్తారు దర్శకులు. యూత్ ని ఆకట్టుకోవడానికి. కానీ ‘కోర్ట్’లో అలాంటివి సన్నివేశాలు మచ్చుకైనా కనిపించవు. చాలా డీసెంట్‌గా ఈ ట్రాక్ నడుస్తుంది. పాట కూడా హాయిగా ఆహ్లాదకరంగా సాగిపోతుంది. మంగపతి ఎంట్రీతో ఝలక్ వస్తుంది. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. విలనిజానికి కొత్త షేడ్‌లా కనిపిస్తుంది. మంగపతి పాత్ర, పరువు కోసం పాకులాడిపోయే విధానం, ఆ పాత్రలో శివాజీ రాణించిన విధానం ఆడిటోరియాన్ని అలెర్ట్ చేస్తాయి. ఈ పసి పిల్లలకు మంగపతితో ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు థియేటర్లో ప్రేక్షకులకు కలిగించాడు దర్శకుడు. దాంతో మంగపతి కంట్లో ఈ పిల్లల ప్రేమ ఎక్కడ పడుతుందో అనే కంగారు ప్రేక్షకుల్లోనూ కలిగించాడు. ఇక ఈ ప్రేమ కథకు మంగపతి విలన్‌గా మారాక.. కథ మరింత రసవత్తరంగా తయారవుతుంది.
మంగపతి ఎంట్రీ సీనే.. హడలు పుట్టిస్తుంది. చిన్న పిల్లలకు ఎలాంటి దుస్తులు వేస్తున్నారు? అనే పాయింట్ పై మాట్లాడినప్పుడు ధర్మాగ్రహమే అనిపిస్తుంది. కానీ అక్కడ సైతం మంగపతిలోని విలన్ లక్షణాల్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. క్రమంగా మంగపతిలోని విలనిజం విశ్వరూపం దాలుస్తుంటుంది. కోర్ట్ రూమ్ లో చందూని ఇరికించే సన్నివేశాలు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. హర్షవర్థన్ వాదిస్తున్నప్పుడు ఆ వాదనలో లొసుగులు థియేటర్లోని సామాన్య ప్రేక్షకుడికి సైతం అర్థమైపోతుంటాయి. ‘ఇవన్నీ నిలవవులే’ అని భరోసా ఏర్పడుతుంది. సెకండాఫ్‌లో ప్రియదర్శి వచ్చి.. ఫ్రీగా వాదించుకోవడానికి ఫస్టాఫ్‌లో గ్రౌండ్ ప్రిపేర్ చేశారా? అనే అనుమానం కలుగుతుంది. కోర్ట్ రూమ్ లో వాదనలు ఎలా ఉండాలంటే… అమాయకులై సానుభూతి కలగాలి. ‘అరె.. ఇలా ఇరుక్కుపోయాడేంటి? ఈ కేసులోంచి బయటకు రావడం కష్టమే’ అని ఫీలింగ్ రావాలి. అప్పుడు హీరో ఎంటరై వాదిస్తుంటే, అమాయకుల్ని గెలిపిస్తుంటే ఓ కిక్ వస్తుంది. అది ‘కోర్ట్’ లో మిస్ అయ్యింది.
సెకండాఫ్‌లో ప్రియదర్శి రాక… మరింత బలాన్ని పెంచింది. తన వాదనలు మాత్రం పర్ఫెక్ట్ గా రాసుకొన్నారు. ప్రియదర్శి కూడా ఇంటెన్స్ ఉన్న పాత్రని సిన్సియర్ గా చేశాడు. కల్యాణ మండపంలో ఆ పదహారు నిమిషాలూ ఏం జరిగింది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. ఆ పదహారు నిమిషాల సీన్ రివీల్ చేసిన విధానం బాగుంది. అక్కడ దర్శకుడికి మార్కులు పడతాయి. రోహిణి పాత్ర ఎగ్రసీవ్ గా మారుతుందన్న విషయం ప్రేక్షకుడికి అర్థమవుతూనే ఉంటుంది. సరైన సమయంలో, సరైన చోట రోహిణి పాత్ర విజృంభిస్తుంది. అక్కడ మళ్లీ క్లాప్స్ పడతాయి. చివరి సీన్లో ప్రియదర్శితో పలికించిన డైలాగులు బాగున్నాయి. అవే ఈ కథకు బలం. చట్టాలు రాసుకోవడం, దాన్ని అమలు చేయడం కాదు – అవేంటో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పండి అని కోరడం న్యాయబద్ధమైన సూచనలా అనిపించింది.
సినిమా అంతా చూసొచ్చాక మంగపతిగా శివాజీ పాత్ర వెంటాడుతుంది. ఆయన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ… అన్నీ మెప్పిస్తాయి. ఇటీవలే ’90’ వెబ్ సిరీస్ లో ఓ మధ్యతరగతి తండ్రిగా కనిపించిన శివాజీ… అంతలోనే ఇంత క్రూరంగా మారిపోవడం, ఈ పాత్రలోనూ మెప్పించడం ఆశ్చర్యపరుస్తుంది. శివాజీని ఈ తరహా పాత్రలకు వాడుకోవచ్చన ఆలోచన దర్శకులకు కలిగించింది. ప్రియదర్శి నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు. రోషన్, శ్రీదేవి చూడముచ్చటగా ఉన్నారు. శ్రీదేవి సహజంగా నటించింది. సాయికుమార్, రోహిణి, హర్షవర్థన్.. వీళ్లంతా వాళ్ల వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.
నాని ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు. ‘కోర్ట్ నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు’ అనేశాడు. ఈ కథపై, ఈ సినిమాపై తనకు అంత నమ్మకం. మంచి పాయింట్ పట్టుకొన్నప్పుడు దర్శకుడు ఎలా తీసినా – తప్పు జరగదు. ‘కోర్ట్’ విషయంలోనూ అదే జరిగింది. మంచి కథకు నటీనటుల, సాంకేతిక నిపుణుల సహాయం దొరికింది. నిర్మాతగా నాని ఎలాగూ ఉన్నాడు. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. వినిపించిన ఒక్క పాటైనా బాగుంది. నేపథ్య సంగీతం హృద్యంగా అనిపించింది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. మొత్తానికి నాని నమ్మకం నిజమైంది. ‘కోర్ట్’లో న్యాయం గెలిచింది.
తెలుగు360 రేటింగ్: 3/5