హోమ్ లోన్ విషయంలో వడ్డీరేట్లు చాలా కీలకం. చాలా చిన్న శాతం వడ్డీరేటు తగ్గినా తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వడ్డీరేటు తగ్గింపు మార్గాలను ఎక్కువ మంది అన్వేషిస్తారు. ఇలాంటి వడ్డీరేటు తగ్గింపు మార్గం మహిళల పేరుతో లోన్ తీసుకోవడం. మన దేశంలో, మహిళల పేరిట తీసుకునే హోమ్ లోన్లు లాభదాయకంగా ఉంటాయి. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంక్‌లు కూడా మహిళా రుణగ్రహీతలను ప్రోత్సహించడానికి కొన్ని ప్రయోజనాలు అందిస్తున్నాయి.
తక్కువ వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీలో రాయితీ, ఆదాయ పన్ను ప్రయోజనాలు, ప్రత్యేక రుణ పథకాలు వంటివి ఆఫర్ చేస్తున్నాయి. ఈ తరహా ప్రోత్సాహకాలతో, మహిళల ఆధ్వర్యంలో, సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళ సింగిల్‌గా లేదా కో-అప్లికెంట్ ఉన్నా వడ్డీ రేటు తగ్గుతుంది. చాలా బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేట్లపై 0.05 శాతం నుంచి 0.10 శాతం రాయితీ ఇస్తున్నాయి. చూడడానికి ఇది చిన్న వ్యత్యాసంగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో కొన్ని లక్షల రూపాయలు ఆదా అవుతాయి.
పాత పన్ను విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాల్సి వచ్చే వారికి హోమ్ లోన్‌లో మహిళా పేరు కూడా ఉంటే, రుణగ్రహీత & సహ-రుణగ్రహీత ఇద్దరూ వ్యక్తిగతంగా తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు, పన్ను ప్రయోజనాలను రెట్టింపు చేసుకోవచ్చు. ఇద్దరూ చెరిసగం EMI కడుతుంటేనే ఇది వర్తిస్తుంది. రాష్ట్రాలు, మహిళలు కొనుగోలు చేసిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీలో 1-2 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నాయి. పొదుపు విషయంలో మహిళలు క్రమశిక్షణ, తెలివిని బ్యాంక్‌లు ఇప్పటికే గుర్తించాయి. అంతేకాదు, పురుషులతో పోలిస్తే మహిళా రుణగ్రహీతలలో లోన్లు ఎగ్గొట్టేవాళ్లు అతి స్వల్పం. కాబట్టి, మహిళల పేరిట గృహ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్లు ఇస్తూంటాయి.