ఎవరైనా లీడర్ హామీ ఇస్తే ఆ పని చేయించుకోవడానికి ఎంత కాలం తిరగాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ సంస్కృతిని నారా లోకేష్ మార్చేస్తున్నారు. హామీ ఇచ్చిన వెంటనే దాన్ని అమలు చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకే మార్గం ఉందంటే దాన్ని వెంటనే ఫాలో అయిపోతున్నారు. రెండు రోజుల కిందట కాశినాయన ఆశ్రమ భోజనశాలను అటవీ భూముల్లో ఉందని అధికారులు కూల్చేశారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో నారా లోకేష్ వెంటనే స్పందించారు.
భక్తుల మనోభావాలను అటవీ అధికారులు పట్టించుకోకపోవడం తప్పిదమని దానికి తాను క్షమాపణలు చెప్పారు. అంతే కాదు తన సొంత డబ్బుతో నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎప్పటికి నిర్మిస్తారో అనుకున్నారు కానీ.. వెంటనే పనులు ప్రారంభమయ్యాయి. రాత్రికి రాత్రి నిర్మాణం కోసం మార్కింగ్ చేశారు. ఉదయం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఫాస్ట్ నెస్ చూసి కాశినాయన భక్తులు కూడా సంతోషపడుతున్నారు.
నారా లోకేష్ ఇటీవలి కాలంలో తాను ఇచ్చిన హామీలకు ప్రభుత్వ పరంగా అమలు చేయడం సాధ్యం కాకపోతే సొంత నిధులను వెచ్చిస్తున్నారు. మంగళగిరి ఎకోపార్కులో వాకింగ్ చేసే వారి కోసం ఉచిత ఎంట్రీ సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చడానికి రూ. ఐదు లక్షలు సొంత నిధులు కేటాయించారు. ఎకో పార్క్ లో ఉచిత సౌకర్యం కల్పిస్తే నిర్వహణకు డబ్బులు ఉండవని అధికారులు తేల్చేశారు. అదే సమయంలో రాష్ట్రమంతా అమలు చేయాలన్న డిమాండ్ వస్తుంది. అందుకే సొంత డబ్బులు కట్టారు.