తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఏపిలో నుంచి తెలంగాణాలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఏపి ప్రభుత్వం కూడా తెలంగాణా వాహనాల నుంచి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. ఈ డబుల్ ఎంట్రీ టాక్స్ విధానం వలన రెండు రాష్ట్రాల మద్య నిత్యం తిరిగే వాహన యజమానులకి చాలా అదనపు భారం భరించవలసివస్తోంది. కానీ తెలంగాణా ప్రభుత్వం వారి విజ్ఞప్తిని మన్నించకపోవడంతో నేటికీ అదే విధానం కొనసాగుతోంది. ఈ విధానం అమలులోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. దీని వలన ఏ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తోందనే విషయం తెలుసుకోవడం కోసం హైదరాబాద్ లోని సిపిఐ పార్టీ సమాచార హక్కు చట్టం క్రింద రెండు రాష్ట్రాల రవాణా శాఖలకి దరఖాస్తు చేసుకొని ఆ వివరాలు రాబట్టింది. వాటి ప్రకారం 2015-16 సం.లలో మొత్తంగా చూసినట్లయితే తెలంగాణా కంటే ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ ఆదాయం సమకూరినట్లు తేలింది.
ఈ ఆర్ధిక సం.ముగింపు నాటికి ఆంధ్రప్రదేశ్ కి మొత్తం రూ.31 కోట్లు ఆదాయం రాగా, తెలంగాణాకి మొత్తం రూ.25 కోట్లు ఆదాయం వచ్చింది. తెలంగాణా నుంచి ఏపికి వచ్చే సరుకు రవాణా వాహనాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి రూ. 10 కోట్లు రాగా, అవే వాహనాల నుంచి తెలంగాణాకి రూ.10 కోట్లు సమకూరింది. ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా తెలంగాణా ప్రభుత్వానికి రూ.13.39 కోట్లు ఆదాయం రాగా, అవే వాహనాల నుంచి ఏపికి రూ.9.5 కోట్లు ఆదాయం వచ్చింది. చిన్నచిన్న వాహనాల ద్వారా ఏపికి రూ.3.6కోట్లు ఆదాయం సమకూరగా, తెలంగాణాకి రూ.1.22 కోట్లు సమకూరింది.
ఏపిలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలు చాలా ఉన్నందున తెలంగాణా నుంచి వచ్చే పర్యాటక వాహనాల నుంచి రూ.1.26 కోట్లు ఆదాయం వస్తే, వాటి నుంచి తెలంగాణాకి కేవలం రూ.3.84 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరింది.
తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను వసూలు చేయడం మొదలుపెట్టిన నెలన్నర తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. అయినప్పటికీ తెలంగాణా కంటే ఏపికే ఎక్కువ ఆదాయం సమకూరడం గమనిస్తే వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ ఆదాయం రావచ్చని స్పష్టం అవుతోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే మంచి ఆదాయం వస్తుందని ప్రవేశపన్ను ద్వారానే స్పష్టంగా కనబడుతోంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలు పర్యాటక రంగంపై ఇంకా శ్రద్ధ పెట్టడం మంచిది. తెలంగాణా ప్రభుత్వం యదాద్రి, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలని తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేస్తోంది కనుక త్వరలోనే తెలంగాణా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.