పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున డీఎంకే నేతలు వచ్చి కలుస్తానంటే జగన్ అంగీకరించారు. వారు పసుపు కండువా కప్పుతానంటే అంగీకరించారు. కండువా కప్పించుకుని స్టాలిన్ పంపించిన ఉత్తరం తీసుకున్నారు. అయితే దానికి సమాధానం చెప్పలేదు. తాను ఇరవై రెండో తేదీన స్టాలిన్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలా లేదా అన్నది ఆయన ఇంకా నిర్ణయించుకోలేదు. మరో వైపు తన మిత్ర పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్ కూటమిలోని పార్టీ ఈ సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ వెళ్లాలని నిర్ణయించుకుంది.
బీఆర్ఎస్ నిర్ణయంతో జగన్ పై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఢిల్లీలో జగన్ ధర్నా చేసినప్పుడు ఆయనకు మద్దతుగా ఇండియా కూటమి పార్టీలు అన్నీ వచ్చాయి. దానికి ప్రతిఫలంగా జగన్ ఇప్పటి వరకూ వారికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించలేకపోయారు. ఇప్పుడు దక్షిణాది అంశాన్ని నెత్తికెత్తుకున్న ఇండియా కూటమిలోని కీలక పార్టీకి మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. స్టాలిన్ కు జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు.
జగన్ హాజరైతే బీజేపీకి కోపం ఇస్తుందన్న భయం వైసీపీ నేతల్లో ఉంటుంది. అయితే ఎంత కాలం ఇలా భయపడుతూ బతకాలని తిరగబడదామన్న సూచనలు కొంత మంది చేస్తున్నారు. అయితే దానికి ఇంకా సమయం ఉందా లేకపోతే.. ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఎలా చూసినా బీజేపీతో కలిసేందుకు వైసీపీకి అవకాశం లేదు. అందుకే కాంగ్రెస్ కూటమి అయితేనే మంచిదన్న ఆలోచనకు వస్తున్నారు. కానీ ఎప్పుడు ఆ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లాలో మాత్రం వారికి అర్థం కావడం లేదు.