వివేకా హత్య కేసులో సీబీఐపై చేసిన కుట్రను పులివెందుల పోలీసులు బయట పెట్టారు. దర్యాప్తు బృందాన్ని పని చేయకుండా చేయడానికి.. బెదిరించతడానికి సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసు పెట్టారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లుగా గుర్తించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు వివేకా కుమార్తె, అల్లుడిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపి నివేదికను జమ్మలమడుగు కోర్టులో సమర్పించారు.
వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు బెదిరించారనడానికి ప్రాథమిక ఆధారాలు కూడా లేవని పులివెందుల పోలీసులు తేల్చారు.
వివేకా హత్యకేసును తేల్చకుండా సీబీఐపై గత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడిందో లెక్కే లేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే కర్నూలులో అడ్డం పడిపోయారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. సీబీఐకి సహకరించేందుకు నిరాకరించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో డ్రామాలు ఆడిన తర్వాత హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు. జైలుకెళ్లకుండానే బెయిల్ వచ్చేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వివేకా హత్యకేసు లో బయటపడాల్సిన అనేక అంశాలు సంచలనంగా మారుతున్నాయి.
వివేకాను ప్లాన్డ్ గా మర్డర్ చేసి.. గుండెపోటుగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేయలేదు. తప్పుడు దర్యాప్తు చేసి అమాయకుల మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని చూశారు. సీబీఐకి కేసు ఇవ్వడంతో వారి ఆటలు సాగలేదు. సీబీఐపైనా ఒత్తిడి చేశారు. చివరికి ఒక్కొక్కటి బయటకు వస్తోంది.