బహుశా.. డబ్బింగ్ సినిమాలో గత దశాబ్దపు రికార్డులన్నింటినీ ఈ సినిమా తుడిచిపెట్టేలా ఉంది. తమిళ డబ్బింగులు ఎక్కువైపోయి.. అక్కడి పెద్ద హీరోల సినిమాలు ఇటొస్తే తప్ప మిగతా వాటిని పట్టించుకోని దశలో ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో అంతులేని ఆసక్తిని రేపింది ఈ సినిమా. టైటిల్ ను చూస్తే తెలుగు జనాలు ఈ సినిమా ఆడే థియేటర్ల వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరని అనుకున్నా దశ నుంచి బిచ్చగాడి ఫీట్లను చూసి ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చేసింది.
మూడువందలకు పైగా థియేటర్ల కు విస్తరించింది బిచ్చగాడి సామ్రాజ్యం! ఒకవైపు పెద్ద హీరోల సినిమాలు విడుదల తేదీన థియేటర్ల సంఖ్య విషయంలో పెద్ద మార్కును తాకి.. ఆపై రెండో వారానికి చప్పున సింగిల్ డిజిట్ కు చేరుకొంటుంటే.. బిచ్చగాడు మాత్రం సింగిల్ డిజిట్ తో మొదలుపెట్టి ఇప్పుడు వందల థియేటర్ల లో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే నిర్మాత పెట్టుబడికి పది రెట్ల లాభాలను సంపాదించి పెట్టింది ఈ సినిమా. దాదాపు ఇరవై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని భోగట్టా.
అయితే ఇంతడితో బిచ్చగాడి కథ అయిపోలేదు.. పెద్ద హీరోల సినిమాలేవీ ఫీల్డ్ లో లేని తరుణంలో, ఈ మధ్య విడుదల అయిన చిన్న సినిమాలు కూడా ఏవీ పాజిటివ్ టాక్ ను పొందని నేపథ్యంలో బిచ్చగాడు బాక్సాఫీసును సోలోగా ఏలేస్తున్నాడు. ఈ శుక్రవారంతో బిచ్చగాడు మరిన్ని థియేటర్లకు విస్తరించి మూడువందలపై మార్కును రీచ్ అయ్యాడని నిర్మాతలు చెబుతున్నారు. మరి ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ పోటీ లో లేవు, సత్తా చాటడానికి చిన్న సినిమాలూ లేవు. దీంతో మరో వారం ఈ సినిమాపై కలెక్షన్ల వాన కురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా పాతిక కోట్ల వరకూ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపై శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చే సొమ్ము ఉండనే ఉంటుంది.