భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర భాజపా కోర్ కమిటీ నేతలతో శుక్రవారం డిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నియామకం గురించి ఎటువంటి చర్చ జరుగలేదని ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు చెప్పినప్పటికీ, దానిపై కూడా చర్చ జరిగినట్లు ఆయన మాటలే తెలియజెప్పుతున్నాయి. అధ్యక్షుడి నియామకం గురించి అమిత్ షా ప్రకటన చేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా సోము వీర్రాజుని నియమించాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశః నేడో రేపో అధ్యక్షుడి పేరు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
అయన తెదేపాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా వ్యతిరేకిస్తారు కనుక ఒకవేళ సోము వీర్రాజుని అధ్యక్షుడుగా నియమించినట్లయితే, తెదేపా-భాజపాల సంబంధాలపై అది తీవ్ర ప్రభావం చూపవచ్చు. కానీ ఆయన అధ్యక్షుడయితే రాష్ట్రంలో భాజపా కార్యక్రమాలలో వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది.
ఈరోజు జరిగిన సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు హాజరు కాకపోవడం విశేషం. ఆయన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడుతుంటారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు, ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, పురందేశ్వరి, సోము వీర్రాజు, పార్టీ జాతీయ కార్యదర్శులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.