గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కమిషనర్ సహకరించడం లేదని .. ప్రతిపక్ష నాయకులు పదవులు నిర్వహించడం కష్టంగా మారిందని అందుకే రాజీనామా చేస్తున్నానని కారణం చెప్పారు. నిజానికి ఆయనకు కార్పొరేటర్ల మద్దతు లేదు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక్క వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అవిశ్వాసం పెడితే పదవి పోవడం ఖాయమని ముందే రాజీనామా చేశారు.
అసలు కావటి మనోహర్ నాయుడుకు రెండున్నరేళ్లకు మాత్రమే పదవి ఇచ్చారు. పాదర్తి రమేష్ గాంధీ అనే కార్పొరేటర్ మేయర్ కావాల్సింది. కానీ ఆయనను కాదని మనోహర్ నాయుడుకు చాన్సిచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత రమేష్ గాంధీకి చాన్సిస్తామని అప్పట్లో వైసీపీ హైకమాండ్ హామీ ఇచ్చింది. కానీ రమేష్ గాంధీ కార్పొరేటర్ గా ప్రమాణం చేయకుండానే మరణించారు. దీంతో మనోహర్ నాయుడు రెండున్నరేళ్లు గడిచిన తర్వాత కూడా రాజీనామా చేయలేదు. పైగా హైకమాండ్ ఆయనను ప్రోత్సహించి చిలుకలూరిపేట టిక్కెట్ కూడా ఇచ్చింది.
మనోహర్ నాయుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి జగన్ మనసును దోచారు. పవన్ ను..లోకేష్ ఆయన ఘోరంగా తిట్టేవారు. అందుకే ఆయనకు చిలుకలూరిపేట టిక్కెట్ లభించింది. ఇటీవల అరెస్టు చేస్తారేమోన్న భయంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన మాటల్ని విని హైకోర్టు కూడా మండిపడింది. తన మేయర్ పదవి తనకు ఉంచితే.. టీడీపీలో చేరుతానని సంప్రదింపులు జరిపారని అయినా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో రాజీనామా చేశారని గుంటూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి.