ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో జరిగిన మహానాడు సమావేశంలో మాట్లాడుతూ, “80 శాతం మంది ప్రజలు సంతృప్తిచెందినప్పుడే మన ప్రభుత్వానికి మంచి మార్కులు పడినట్లు లెక్క. 80 శాతం ప్రజలు మనవైపు ఉంటే ఇంక మనకి తిరుగు ఉండదు. కనుక అందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలి,” అని అన్నారు. అంతకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా అదే మాట చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలను సంతృప్తిపరచడం ఆషామాషీ విషయమేమీ కాదు కనుక తెదేపా ప్రభుత్వం అటువంటి గొప్ప లక్ష్యంతో పనిచేయడం చాలా హర్షించదగ్గ విజయం. ఆయన ఒకటికి రెండుసార్లు ఆమాటని చెప్పడంతో ఇక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తారని అందరూ భావించారు. కానీ నెల తిరక్కుండానే రాష్ట్రంలో 80 శాతం మంది సంతృప్తి చెందారని సర్వేల ద్వారా తేలిందని ముఖ్యమంత్రి చెప్పడం విశేషం. అంటే ఆ ముక్క చెప్పడానికే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడారని భావించవలసి ఉంటుంది.
తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవో ఒక సమస్యలతోనే రెండేళ్ళు పూర్తయిపోయాయి. నేటికీ అదే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆర్ధిక సమస్యల కారణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. అతికష్టం మీద ప్రభుత్వం కొన్ని సంక్షేమ పధకాలని నిర్వహిస్తున్నప్పటికీ కొత్తగా ఏవీ ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పదేపదే వినిపిస్తూనే ఉన్నాయి. రాజధాని భూములు, సధావర్తి సత్రవ భూముల కుంభకోణం, కాల్ మనీ వ్యవహారాలు, ఓటుకి నోటు కేసు వంటివెన్నో తెదేపా ప్రభుత్వానికి మాయని మచ్చని మిగిల్చాయి. ఇక పంటరుణాల మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి వంటి హామీల అమలులో వైఫల్యం, కేంద్రం మంజూరు చేయవలసిన ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్టులు మొదలైన హామీల అమలు చేయకపోవడం వలన కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో 50 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందినా అది చాలా గొప్ప విషయమే అవుతుంది. కానీ ఏకంగా 80 శాతం మంది ప్రజలు సంతృప్తిచెందారని చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. తెదేపా సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ పాలన పట్ల 80 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది,” అని చెప్పారు. అంటే ఇక నుంచి తెదేపా నేతలు, మంత్రులు అందరూ కూడా ఇదే పాట పాడటం ప్రారంభిస్తారని భావించవచ్చు. అయితే ఈ విధంగా ఆత్మవంచన చేసుకోవడం వలన ఎటువంటి లాభమూ లేకపోగా తమకే నష్టం జరుగుతుందని తెలిసి కూడా వారు ఆవిధంగా చెప్పుకోవడం విశేషమే.
“రాష్ట్ర ప్రజలందరూ తెదేపాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందరూ కలిసి తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి,” అని చెపుతూ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ‘గడప గడపకి వైకాపా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే, రాష్ట్ర ప్రజలు అందరూ మావైపే ఉన్నారని తెదేపా నేతలు చెప్పుకోవడం విశేషం. రెండు పార్టీలు కూడా ప్రజలు తమవైపే ఉన్నారని భావిస్తున్నాయి కనుక తెదేపాలో చేరిన 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకి వెళ్తే ప్రజలు ఎవరి పక్షాన్న ఉన్నారో తేలిపోతుంది కదా?