హుందాతనం లేని రాజకీయ నేతలు పార్టీలను లీడ్ చేస్తే రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. వైసీపీ అధికారంలో ఉన్న పదేళ్లు ఏపీలో అంతా బూతు రాజకీయమే నడిచింది. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతల్ని తిట్టించడమే ఓ మిషన్ గా పెట్టుకుని దానికి వందల కోట్లు ఖర్చు చేసిన వైనం.. అలా తిట్టిన వారికే పదవులిచ్చిన దౌర్భాగ్య సంస్కృతిని ఎవరూ మర్చిపోలేరు. ప్రజలు కూడా మర్చిపోలేదు. అందుకే పాతాళానికి పంపించారు. అయితే ఏపీ నుంచి తెలంగాణ రాజకీయ పార్టీలు పాఠాలు నేర్చుకోలేదు. పైగా మరింత దిగజారిపోతున్నారు.
ఓ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అలా తిట్టిస్తారా ?
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిట్టించేవారు. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రిని.. ఆయన కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. జర్నలిస్టుల పేరుతో ఇలాంటి బూతులు తిట్టించే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారు పోస్టు చేసిన వీడియో చూసిన వారికి.. ఎంత కాంగ్రెస్ వ్యతిరేకి అయినా సరే అసహ్యం వేస్తుంది. అలా తిట్టించారు. పోలీసు రక్షణ లేకపోతే నేనే చంపేసేవాడ్ని అని ఆ వ్యక్తి అన్నారు. అసలు ఆ వ్యక్తిని చూస్తే రాజకీయాలపై కూడా అవగాహన ఉండదని.. అనిపిస్తుంది. డబ్బులిచ్చి లేకపోతే మద్యం ఇచ్చి తిట్టించి ఉంటారు. అంత అవసరం ఏంటి ?
ఆ తిట్లకు సీఎం చచ్చిపోవాలని అనడం ఏంటి ?
ఇలా తిట్లు తిట్టించి.. జనం రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారని మరొకరైతే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని బీఆర్ఎస్ ముఖ్యనేతలు అంటున్నారు. అంటే సీఎం ఆత్మహత్య చేసుకోవాలని వారి సలహా. వారు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ కూడా ఆ మాటల్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి కౌంటర్ ఇస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటే ఉపఎన్నికలు వస్తాయని ఓ చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ను ఉద్దేశించి మార్చురీ వ్యాఖ్యలు చేశారు. కానీ అవి కేసీఆర్ ను అన్నట్లుగా ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో చావుల రాజకీయం తెలంగాణలో ప్రారంభమయింది.
ప్రజలు దొందూ దొందే అనుకుంటే కష్టం!
ఏపీలో వైసీపీ బూతుల సామ్రాజ్యం నడిపింది. అలాగని తెలుగుదేశం రివర్స్ కౌంటర్లు అంతే బూతుల స్థాయిలో ఇవ్వలేదు. వాళ్లు ఉండాల్సిన వాళ్లు కాదని ప్రజల వద్దకు వెళ్లింది. ప్రజలూ అదే చెప్పారు. కానీ తెలంగాణలో రెండు పార్టీలు పరస్పరం గీత దాటిపోతున్నాయి. ప్రజలకు మరో చాయిస్ లేకుండా చేస్తున్నాయి. ఏపీ నుంచి గుణపాఠాలు నేర్చుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ హుందా భాషను ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అనుకోవచ్చు.