జయజయహే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించారని ఆయనది ఆంధ్రా అని కవిత శాసనమండలిలో విమర్శించారు. దీనిపై రేవంత్ వేరే సందర్భంలో గతంలో సమాధానం ఇచ్చారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి.. ఆలయానికి ఆర్ట్ డైరక్టర్ గా పని చేసిన ఆనంద్ సాయి ఎవరని ప్రశ్నించారు.. సెక్రటేరియట్ కు తీసుకు వచ్చి కాళ్లు మొక్కిన చినజీయర్ ది ఏ ప్రాంతమని ప్రశ్నించారు. అంత ఎందుకు..బతుకమ్మపై కవిత ఓ పాటను గతంలో చిత్రీకరించారు. దానికి తమిళ్ సుప్రసిద్దదర్శకుడ్ని ఎంచుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
కళాకారులకు కుల, మత , ప్రాంతాలుండవు. ఆ మాటకు వస్తే ప్రొఫెషనల్స్ ఎవరికీ ఇవేమీ ఉండవు. వారికి వచ్చిన విద్యను వారి స్థాయిలో మార్కెటింగ్ చేసుకుంటారు. దాని ద్వారా ఉపాధి పొందుతారు. ఎంత గొప్ప టాలెంట్ ఉంటే.. అందగొప్ప వ్యక్తి. ఆయన ఫలానా ప్రాంతం నుంచి వచ్చాడని తక్కువ చేయడం మా ప్రాంత సంగీతాన్ని ఆయన చేయలేడని చెప్పడం చిన్నబుద్దే. సంగీతానికి ప్రాంతం ఉంటుందా?
రాజకీయ నేతలు.. ఇప్పటికీ తమ ప్రాంతీయవాద రాజకీయం కోసం.. విభిన్న వర్గాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఒకటి.. రెండు సార్లు ఆ విషయం ఫలితాలను ఇవ్వవొచ్చు కానీ ఎక్కువ సార్లు మిస్ ఫైర్ అవుతుంది. దాని వల్ల ఆ పార్టీ నేతలకే నష్టం. బీఆర్ఎస్ నేతలు ప్రతీ దానికి ఆంధ్రా అని రాగం తీయడం మానకపోతే.. వీళ్లింతే అని తెలంగాణ అంతా అనుకునే పరిస్థితి వస్తుంది.