హీరోగానే కాదు, నిర్మాతగానూ తనని తాను నిరూపించుకొన్నాడు నాని. వరుస హిట్లతో… సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. తాజాగా ‘కోర్ట్’ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే పెట్టుబడి మొత్తం తిరిగి తెచ్చుకొన్న నానికి ఇప్పుడు థియేటర్ నుంచి వస్తుందంతా లాభమే. నైజాంలో ఈ సినిమా ఊహించని వసూళ్లు తెచ్చుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్ర, శనివారాలు చాలా థియేటర్లు హౌస్‌ఫుల్స్ అయ్యాయి. ఆదివారం కూడా ఈ మ్యాజిక్ కొనసాగుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు ‘కోర్ట్ 2’పై దృష్టి పడింది. ఈ సినిమా సీక్వెల్ ఉండొచ్చని, ఈసారి అయితే పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉంటుందని నాని సక్సెస్ మీట్ లో హింట్ ఇచ్చేశాడు. ‘కోర్ట్’ లాంటి కథలకు సీక్వెల్స్ చేసే స్కోప్ వుంది. ఈసారి ఫోక్సో అనే పాయింట్ చుట్టూ తిరిగింది. సీక్వెల్ లో మరో కొత్త పాయింట్ పట్టుకోవొచ్చు. లాయర్ పాత్ర అలానే ఉంటుంది. కేసు, మిగిలిన కాన్ఫ్లిక్ట్ మారుతుంది. ఇలా చేసుకొంటూ పోతే ఎన్ని భాగాలైనా తీసుకోవొచ్చు. హిట్ ని నాని ఇలానే ఫ్రాంచైజీగా మార్చేశాడు. కేసు మారుతుంది, హీరో మారతాడు, డైరెక్టర్ మాత్రం సేమ్ టూ సేమ్. ఈ ఫ్రాంచైజీ హిట్ అయ్యింది. ‘కోర్ట్‌ను’ కూడా ఇలానే ఫ్రాంచైజీగా మార్చేయొచ్చు.
ఇప్పటికే ‘కోర్ట్’ దర్శకుడ్ని నాని లాక్ చేసేశాడు. రెండో సినిమా కూడా వాల్ పోస్టర్ బ్యానర్‌పైనే చేయాలన్నది ముందస్తు ఒప్పందం. అయితే ఈసారి ‘కోర్ట్ 2’ ఉండకపోవొచ్చు. ఓ కమర్షియల్ సినిమా చేశాక, ‘కోర్ట్ 2’ ఐడియా పట్టాలెక్కే అవకాశం ఉంది.