రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత మేర షూట్ చేశారు. ఈ చిత్రానికి సంధించిన ఆసక్తిరరమైన విషయాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదో స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే వుంది. అయితే… ఏ ఆట నేపథ్యంలో సినిమా నడుస్తుందన్న విషయంలో స్పష్టత లేదు.
క్రికెట్, కబడ్డీ, కుస్తీ.. ఇలా దాదాపు అరడజను ఆటలు ఈ సినిమాలో కనిపిస్తాయట. హీరో ఆట కూలీగా నటించబోతున్నాడని తెలుస్తోంది. మనకు కూలీలు తెలుసు కానీ, ఆట కూలీల గురించి తెలీదు. ఐపీఎల్ లో ఆటగాళ్లని ఎలా కొనుక్కొంటున్నారో, అలా… కొంతమందిని కొనుక్కొని, ఓ జట్టుగా తయారు చేసి, ఆటలు ఆడిస్తారు. ఆడినందుకు రోజుకు ఇంత అని డబ్బులు ఇస్తారు. అదీ ఆట కూలీ అంటే. ఇలాంటి ఆటగాడిగా చరణ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇది వరకే క్రికెట్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు.
ఈ సినిమాలో ధోనీ నటిస్తున్నాడన్న ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ధోనికి ఉన్న పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజంగానే ధోనీ గనుక ఓ పాత్ర చేస్తే ఈ సినిమా మైలేజీ వేరేలా వుంటుంది. పైగా ఇది స్పోర్ట్స్ డ్రామా. ధోనీ నటించే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. `రాబిన్ వుడ్`లో క్రికెటర్ వార్నర్ ఓ పాత్ర చేశాడు. దాంతో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. అదే ధోనీ లాంటి స్టార్ కనిపిస్తే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. మరి.. ఈ కాంబో సెట్ అవుతుందేమో చూద్దాం.